AP CM Chandrababu: చంద్రబాబు ముందు పెను సవాళ్లు!

అమరావతిని అభివృద్ధి, పోలవరం ప్రాజెక్ట్ ను పూర్తి చేయడం, విశాఖలో రైల్వే జోన్ ఏర్పాటు చేయడం, వెనుకబడిన ప్రాంతాలకు కేంద్రం నుండి నిధులు సమకూర్చుకోవడం చంద్రబాబు ముందున్న ప్రధాన సవాళ్లు అని ప్రముఖ విశ్లేషకులు చలసాని నరేంద్ర అభిప్రాయం వ్యక్తం చేశారు.

New Update
AP CM Chandrababu: చంద్రబాబు ముందు పెను సవాళ్లు!

ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికలలో అందరికి విస్మయం కలిగించే రీతిలో ఫలితాలు వచ్చాయి. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వ వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారని, టిడిపి కూటమికి అనుకూలంగా ఫలితాలు వచ్చే అవకాశం ఉందని చాలామంది అంచనాలు వేసినప్పటికీ ఫలితాలు ఈ విధంగా ఉంటాయని చివరికి కూటమి నేతలు సహితం ఊహించలేదు. తాను ఐదేళ్లుగా దృష్టి సారించిన `నగదు బదిలీ' పధకాల లబ్ధిదారులు తన ఓటర్లు అనుకొంటూ ధీమాతో ఉన్న జగన్ మోహన్ రెడ్డి కేవలం 11 సీట్లకు పరిమితం కావాల్సి వచ్చింది.

ఐదేళ్ల జగన్ ప్రభుత్వంలో ఆర్థిక వ్యవహారాలు సంక్షోభంలో చిక్కుకోవడం, సంక్షేమం తప్ప అభివృద్ధి లేకపోవడం, ఉపాధి అవకాశాలు అడుగంటడం, వీటన్నింటికీ మించి కక్ష సాధింపు చర్యలు మితిమీరడంతో ప్రజలు నిశబ్ధంగా ఓ విప్లవం మాదిరిగా తీర్పు ఇచ్చారనే అభిప్రాయం కలుగుతుంది. ఒకరు తప్ప మొత్తం మంత్రులు ఓటమి చెందడం, నిత్యం మీద ముందు ప్రత్యర్థుల పట్ల దుర్భాషలాడి నేతలందరూ ఈ గాలిలో కొట్టుకుపోవడం అంతా చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతుంది.

పైగా, టీడీపీ ఎవ్వరూ ఊహించని ఆధిక్యతతో అధికారంలోకి రావడమే కాకుండా కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం సొంతంగా మెజారిటీ పొందలేక పోవడం, ఆ ప్రభుత్వ మనుగడకు టిడిపి మద్దతు కీలకంగా మారడం మరో విస్మయకర పరిణామం. జాతీయ స్థాయిలో మరోసారి `కింగ్ మేకర్' మాదిరిగా చంద్రబాబు నాయుడు వ్యవహరించేందుకు అవకాశం ఏర్పడిందని జాతీయ మీడియా పేర్కొంటున్నది.

అయితే, ఒక పక్క ఎన్నికల హామీలను అమలు పరుస్తూ, మరో వంక కేంద్రంతో సయోధ్యతో వ్యవహరిస్తూ, రాజకీయంగా నిలదొక్కుకోవడం చంద్రబాబు నాయుడుకు గతంలో మాదిరిగా అంత సులభమైన అంశం కాదని భావించాల్సి ఉంటుంది. రాబోయే రోజులలో పెను సవాళ్లను ఆయన ఎదుర్కోవాల్సి ఉంటుంది.

ముఖ్యంగా చంద్రబాబు నాయుడు జైలులో ఉన్నప్పుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ముందుకు వచ్చి, టీడీపీతో పొత్తు గురించి జైలు వద్దనే పొత్తు ప్రకటించడంతో శ్రేణులలో ఉత్సాహం, ఆత్మవిశ్వాసం చెలరేగి ఎన్నికలలో పోరాడే విధంగా చేసిందనే ప్రచారం జరుగుతుంది.

టిడిపి, జన సేన, టిడిపిల మధ్య పొత్తు కుదరడమే కాకుండా, మూడు పార్టీల మధ్య గతంలో ఎన్నడూ లేని విధంగా ఓట్ల మార్పిడి జరగడంలో పవన్ కళ్యాణ్ చూపిన పట్టుదల, రాజకీయంగా సీట్ల సర్దుబాట్ల వద్ద ఆయన ప్రదర్శించిన పెద్దరికం ఎక్కువగా తోడ్పడినట్లు అందరూ భావిస్తున్నారు.

ఈ విషయంలో ఆయన ఎంతో హుందాగా వ్యవహరించారు. టిడిపి - జన సేన మధ్య పొత్తు ఏర్పడకుండా అడ్డుకొనేందుకు జగన్ మోహన్ రెడ్డి చేయని ప్రయత్నం లేదు. రెచ్చగొట్టే వాఖ్యలు, పవన్ కళ్యాణ్ పై వ్యక్తిగతంగా అసభ్యపు మాటలతో వెనుకడుగు వేసే విధంగా చేయాలని చూశారు.

మరోవంక, బిజెపి పెద్దల వద్ద తనకు గల పలుకుబడిని ఉపయోగించి వారిద్దరూ కలవకుండా పవన్ కళ్యాణ్ పై వత్తిడి తెచ్చే ప్రయత్నం చేశారు. పవన్ కళ్యాణ్ వైసీపీతో కలిసే విధంగా చూడమని తనను జగన్ మోహన్ రెడ్డి కోరారని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ వెల్లడించడం గమనార్హం. టిడిపితో కలవకుండా పవన్ ను ప్రధాని నరేంద్ర మోదీ, హోమ్ మంత్రి అమిత్ షా వంటి వారు తీవ్రంగా ప్రయత్నం చేశారు. కానీ ఆయన పట్టుదల చూసి, రాష్ట్రంలో జగన్ వ్యతిరేకత నెలకొందని గ్రహించి అయిష్టంగానే టిడిపితో పొత్తుకు సిద్దపట్టారు.

టిడిపితో పొత్తు పెట్టుకున్నా ఎన్నికలకు వారం రోజులకు ముందు వరకు కేంద్ర బీజేపీ నాయకులు ఎవ్వరూ ఏపీకి ప్రచారానికి రాలేదు. కీలక అధికారులు బహిరంగంగా ఎన్నికల కోడ్ ఉల్లంఘించి, వైసీపీకి అనుకూలంగా వ్యవాహరిస్తున్నా ఎన్నికల కమిషన్ పట్టించుకోలేదు. అయినా వైసీపీ తుడిచిపెట్టుకు పోతుందని గ్రహించి, చివరి వారం రోజుల్లోనే అమిత్ షా, మోదీ వంటి వారు ప్రచారానికి వచ్చారు. ఎన్నికల కమిషన్ దూకుడుగా వ్యవహరించడం ప్రారంభించింది.

కేంద్రంలో మంత్రి పదవులు విషయంలో బీజేపీ మిత్రపక్షాల పట్ల ఉదారంగా వ్యవహరింపలేదని స్పష్టం అవుతుంది. తమ అధికారంలో వారు తలదూర్చేందుకు సందు ఇచ్చే అవకాశాలు కనిపించడం లేదు. కనీసం ఏపీలో అభివృద్ధికి కేంద్రం ఏమాత్రం సహకారం అందిస్తుందో అన్నది గత అనుభవాల దృష్ట్యా ప్రశ్నార్ధకమే. ముందుగా రాజధాని నగరం అమరావతిని అభివృద్ధి చేయడం, పోలవరం ప్రాజెక్ట్ ను పూర్తి చేయడం, విశాఖలో రైల్వే జోన్ ఏర్పాటు చేయడం, విభజన చట్టంలో పేర్కొన్న విధంగా వెనుకబడిన ప్రాంతాలకు కేంద్రం నుండి నిధులు సమకూర్చుకోవడం నేడు చంద్రబాబు ముందున్న ప్రధాన సవాళ్లు.

వైఎస్ జగన్ నిర్లక్ష్య ధోరణి కారణంగా పోలవరం ప్రాజెక్ట్ పడకవేసింది. దాని పనులు చేపట్టడంలో అనేక చిక్కులు ఇమిడి ఉన్నాయి. ఇక రాష్ట్రనికి ప్రత్యేక హోదా కల్పించే విషయంలో బీహార్ కూడా పట్టుబడుతున్న కారణంగా కేంద్రం స్పందించే అవకాశం లేదు. కడప ఉక్కు ఫ్యాక్టరీ వంటి హామీల విషయంలో కేంద్రం సానుకూలత ఏమాత్రం చూపుతుందన్నది ప్రశ్నార్ధకమే. కనీసం అమరావతి నగర నిర్మాణానికి నిధులు ఏమాత్రం సమకూరుస్తుందో చూడాలి.

మరోవంక, సంక్షేమ పథకాలకు సంబంధించి జగన్ అమలు చేస్తున్న పథకాలకు మించి చంద్రబాబు ప్రకటించారు. అందుకోసం అవసరమైన ఆర్థిక వనరులు ఏవిధంగా సమకూర్చుకోవడం అంత తేలికైన అంశం కాదు. వైఎస్ జగన్ హయాంలో వేధింపు చర్యలలో కీలకంగా వ్యవహరించిన అధికారులు, తీవ్ర అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులు ఇప్పుడు తిరిగి చంద్రబాబు ప్రాపకం పొందేందుకు విఫల ప్రయత్నాలు చేస్తున్నారు.

పైగా, నేడు చంద్రబాబు చుట్టూ చేరుతున్న ఇతర అధికారులలో సహితం పలువురు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వారే. పైగా వారి సామర్థ్యం ప్రశ్నార్ధకం. కొత్త డిజిపి, ఇతర ఉన్నతాధికారులను ఎదుర్కోవడంతో ఆయన ప్రాధాన్యతలు వెల్లడి అవుతాయి.

ఇక రాజకీయంగా మొత్తం పార్టీని, ప్రభుత్వాన్ని తన వారసుడైన నారా లోకేష్ చేతిలో పెట్టేందుకు చంద్రబాబు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నట్లు కనిపిస్తున్నది. సీనియర్లు, కీలక నేతలు అందరిని పక్కన పెట్టి మంత్రివర్గం కూర్పు జరిపిన తీరు గమనిస్తుంటే ఇదంతా లోకేష్ మంత్రివర్గం అని స్పష్టం అవుతుంది. మొన్నటి ఎన్నికలలో కూడా సగం మందికి పైగా లోకేష్ కు సన్నిహితులే సీట్లు పొందారు. పార్టీ కోసం మొదటి నుండి కష్టపడి పనిచేస్తున్నవారు, వైఎస్ జగన్ హయాంలో ఎన్నో వత్తిడులు, దాడులు ఎదుర్కొంటున్న వారు సీట్లు పొందలేక వాపోయారు.

కష్టకాలంలో పార్టీ కోసం వెన్నంటి నిలబడిన వారిని, వైసిపి వేధింపులకు తట్టుకొని నిలబడిన వారిని వదిలివేసి, ఎన్నికల ముందు వచ్చిన వారికి, రాజకీయంగా ఇంకా అనుభవం లేనివారికి పెద్దపీట వేస్తే రాజకీయంగా ఇబ్బందులు తప్పకపోవచ్చు. ఈ విషయంలో పార్టీలో అసంతృప్తి చెలరేగకుండా అందరిని కలుపుకు పోవడం నేడు చంద్రబాబు ముందున్న మరో సవాల్.

మరోవంక, మద్దతు ఇస్తున్న పక్షాల పట్ల నిర్ధాక్షిణ్యంగా వ్యవహరిస్తూ, వారిని చీల్చి బలపడకుండా చేయడంలో మోదీ నాయకత్వంలో బిజెపి ప్రసిద్ధి చెందింది. ఆ విధంగా ఏర్పడబోయే సవాళ్ళను తిప్పికొట్టేందుకు కూడా సిద్ధంగా ఉండాల్సి ఉంది. కేంద్రంలో ఎన్డీయేలో టిడిపి కీలక భాగస్వామిగా మారినా కేంద్రంలో తాము బిజెపికి మద్దతుగా ఉండబోతున్నట్లు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పరోక్షంగా సంకేతాలు ఇచ్చారు. జగన్ పై ఉన్న కేసుల దర్యాప్తు ఓ కొలిక్కి తీసుకు రావడం కూడా రాజకీయంగా కీలకమైన అంశం కాగలదు.

Advertisment
Advertisment
తాజా కథనాలు