Manchester Airport: బ్రిటన్‌లోని ఓ విమానాశ్రయంలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. ఎమర్జెన్సీ సిబ్బందితో గొడవకు దిగిన నలుగురు ప్రయాణికులపై విచక్షణ రహితంగా దాడికి పాల్పడ్డారు. ఈ అమానుష సంఘటన మాంచెస్టర్ ఎయిర్‌పోర్టులో జరగగా వివరాలు ఇలా ఉన్నాయి. మాంచెస్టర్ ఎయిర్‌పోర్టుకు వచ్చిన నలుగురు ప్రయాణికులకు అక్కడున్న ఎమర్జెన్సీ సిబ్బందితో చిన్న గొడవ జరిగింది. దీంతో ఆ నలుగురు సిబ్బందిపై దాడికి పాల్పడ్డారు. దీంతో వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులపై కూడా ఆ నలుగురు దాడికి యత్నించారు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన పోలీసులు ఓ ప్రయాణికుడి కళ్లల్లో పెప్పర్ స్ప్రే కొట్టారు. ఒక వ్యక్తిని నేలకు అదిమిపెట్టి.. అతడి తలపై కాళ్లతో దారుణంగా తన్నాడు. అనంతరం వారిని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు.
అయితే పోలీసుల తీరుపై అక్కడున్నవారంతా ఆందోళన వ్యక్తంచేశారు. ప్రయాణికులతో పోలీసులు దారుణంగా ప్రవర్తించారంటూ మండిపడ్డారు. దీంతో స్పందించిన పోలీసులు.. ప్రయాణికులు చేసింది తప్పే. కానీ, వారితో ఆ ముగ్గురు పోలీసులు ప్రవర్తించిన తీరు ఆందోళన కలిగిస్తోంది. ఇరువర్గాలకు జరిగిన దాడిలో ఓ మహిళా పోలీసు ముక్కుకు తీవ్ర గాయమైంది. ఈ చర్యకు పాల్పడిన ఓ పోలీసును విధుల నుంచి సస్పెండ్ చేశాం. ఈ ఘటనపై సమగ్ర విచారణ చేపట్టినట్లు వెల్లడించారు.