త్రిపురలోని ఉల్టా రథయాత్రలో పెను విషాదం చోటుచేసుకుంది. కరెంటు షాక్ తగిలిన ఘటనలో ఏడుగురు మరణించారు. మరికొంతమంది గాయపడ్డారు. ఈ దుర్ఘటనపై ప్రధానమంత్రి మోడీ విచారం వ్యక్తం చేశారు. మరణించిన వారి కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. మరణించిన కుటుంబాలకు రూ. 2లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి రూ. 50వేలు ప్రకటించారు. కుమార్ఘాట్ వద్ద రథయాత్ర సందర్భంగా జరిగిన ఈ ప్రమాదం చాలా బాధాకరమన్నారు. తమ ఆత్మీయులను కోల్పోయిన వారికి సంతాపం తెలిపారు మోడీ.
కాగా గాయపడినవారు త్వరగా కోలుకోవాలని మోడీ ఆకాంక్షించారు. బాధితులకు అన్నివిధాలా సహాయసహకారాలు అందించాలని స్థానిక యంత్రాంగాన్ని ఆదేశించారు. మృతుల కుటుంబాలకు పీఎం సహాయక నిధి నుంచి ఆర్థికసాయం అందిస్తామని మోడీ ట్వీట్ చేశారు.
ఏం జరిగింది?
ఈశాన్య రాష్ట్రమైన త్రిపురలో ఉనాకోటి జిల్లాలో ఉన్న కుమార్ ఘాట్ లో ప్రతిసంవత్సరం జగన్నాథుడి రథయాత్రను ఘనంగా నిర్వహిస్తారు. అందులో భాగంగానే ఈ ఏడాది కూడా బుధవారం యాత్ర ఊరేగింపును మొదలుపెట్టారు. రథయాత్రలోపాల్గొనేందుకు పెద్ద సంఖ్యలు భక్తులు బారులు తీరారు. రథాన్ని ఐరన్ తో తయారు చేసి అలంకరించారు. రథాన్ని భక్తులు ముందుకు లాగుతున్నారు. ఈసమయంలోనే ఒక్కసారి హైటెన్షన్ విద్యుత్ వైర్లకు రథం తగిలింది.
దీంతో రథాన్ని పట్టుకున్న వారందరికీ కరెంట్ షాక్ తగిలింది. మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఏడుగురు అక్కడిక్కడే మరణించారు. మరో 18మందికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
ఈ పెను ప్రమాదం గురించి సమాచారం అందిన వెంటనే సీఎం మాణిక్ సాహాహుటాహుటినా ఘటనాస్థలానికి చేరుకున్నారు. అక్కడి పరిస్థితి సమీక్షించారు. త్రిపుర చరిత్రలో ఈ ఘటన దురద్రుష్టకరమన్నారు. ఇలాంటి ఘటన ఏనాడూ జరగలేదన్నారు. మరణించిన వారి కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.