మోదీ, జిన్‌పింగ్ సంభాషణపై అసదుద్దీన్ ఒవైసీ ఫైర్

బ్రిక్స్ సదస్సు సందర్భంగా మోదీ, జిన్‌పింగ్ మధ్య జరిగిన సంభాషణపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ విమర్శలు గుప్పించారు. బీజేపీ ప్రభుత్వం చైనాకు లొంగిపోయిందని ఆరోపించారు. సరిహద్దు వివాదం దేశ భద్రతకు సంబంధించిన సమస్య అని.. దీనిపై పార్లమెంట్‌లో ప్రత్యేకంగా చర్చ జరగాల్సిన అవసరం ఉందని డిమాండ్ చేశారు.

New Update
మోదీ, జిన్‌పింగ్ సంభాషణపై అసదుద్దీన్ ఒవైసీ ఫైర్

సౌతాఫ్రికాలో జరుగుతున్న బ్రిక్స్ సదస్సు సందర్భంగా భారత ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ మధ్య జరిగిన సంభాషణపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ విమర్శలు గుప్పించారు. బీజేపీ ప్రభుత్వం చైనాకు లొంగిపోయిందని ఆరోపించారు. సరిహద్దు వివాదం దేశ భద్రతకు సంబంధించిన సమస్య అని.. దీనిపై పార్లమెంట్‌లో ప్రత్యేకంగా చర్చ జరగాల్సిన అవసరం ఉందని డిమాండ్ చేశారు. చైనీయులకు భయపడకుండా భారత వీర సైనికులు 40 నెలల పాటు సరిహద్దుల్లో నిలబడ్డారని.. అలాంటప్పుడు మోదీ ఎందుకు జిన్‌పింగ్ ముందు నిలబడలేకపోతున్నారని ఎద్దేవా చేశారు. ఒకవైపు చైనా సైనికులు భారత భూభాగంలో ఆక్రమణలకు పాల్పడుతుంటే..మోదీ మాత్రం జిన్‌పింగ్ వెనకాల ఎందుకు పడుతున్నారో అర్థం కావడం లేదని ఒవైసీ ప్రశ్నించారు.

బ్రిక్స్ సదస్సు చివరి రోజున జిన్‌పింగ్ ప్రధాని మోదీని కలిశారు. ఇరువురు నేతల భేటీలో ఎల్‌ఏసీ అంశం ఎక్కువగా చర్చనీయాంశమైంది. భారత్ కఠిన వైఖరి తర్వాత ఇప్పుడు చైనా వైఖరి కాస్త మెత్తబడినట్లు కనిపిస్తోంది. చైనా-భారత్ సంబంధాలను మెరుగుపరచడం ఉమ్మడి ప్రయోజనాలకు ఉపయోగపడుతుందని.. ఈ ప్రాంతంలో శాంతి, స్థిరత్వానికి అనుకూలంగా ఉంటుందని మోదీతో జరిగిన సమావేశంలో జిన్‌పింగ్ నొక్కిచెప్పారు.

తూర్పు లడఖ్‌లోని వాస్తవ నియంత్రణ రేఖ(ఎల్‌ఎసి) వెంబడి "పరిష్కారం కాని" సమస్యలపై ప్రధాని మోదీ భారతదేశ ఆందోళనలను అధ్యక్షుడు జిన్‌పింగ్‌ దృష్టికి తెచ్చినట్లు భారత విదేశాంగ కార్యదర్శి వినయ్ క్వాత్రా తెలిపారు. "సరిహద్దు ప్రాంతాల్లో శాంతి, ప్రశాంతతను కాపాడుకోవడంతోపాటు సాధారణ స్థితికి అవసరమని మోదీ నేరుగా జిన్‌పింగ్‌తో చెప్పారు. ఈ విషయంలో తూర్పు లడఖ్ సెక్టార్ నుండి దళాల ఉపసంహరణను వేగవంతం చేయాలని, ఉద్రిక్తతలను తగ్గించే ప్రయత్నాలను ముమ్మరం చేయాలని తమ అధికారులను ఆదేశించాలని ఇద్దరు నాయకులు అంగీకరించారు.

భారతదేశం-చైనా సంబంధాల సాధారణీకరణకు సరిహద్దు ప్రాంతాల్లో శాంతి, ప్రశాంతతను కొనసాగించడం, ఎల్‌ఎసిని గౌరవించడం చాలా అవసరమని ప్రధాన మంత్రి నొక్కిచెప్పారు"అని విదేశాంగ కార్యదర్శి చెప్పారు. బ్రిక్స్ సదస్సు సందర్భంగా మోదీ ఇతర బ్రిక్స్ నేతలతో కూడా సంభాషించారు. దక్షిణాఫ్రికాలో ఇరువురు నేతల భేటీ అనంతరం ఢిల్లీలోని చైనా రాయబార కార్యాలయం ప్రకటన కూడా తెరపైకి వచ్చింది. ఇరుపక్షాలు తమ ద్వైపాక్షిక సంబంధాల ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకోవాలని, సరిహద్దు ప్రాంతంలో శాంతిని సంయుక్తంగా కాపాడేందుకు సరిహద్దు సమస్యను పరిష్కరించాలని చైనా రాయబారి వెల్లడించారు.

Advertisment
తాజా కథనాలు