మమ్మల్ని ఆదుకోండి ప్లీజ్..ఆపన్న హస్తం కోసం మోరంచపల్లి గ్రామస్తుల ఎదురుచూపులు!

New Update
మమ్మల్ని ఆదుకోండి ప్లీజ్..ఆపన్న హస్తం కోసం మోరంచపల్లి గ్రామస్తుల ఎదురుచూపులు!

గత వారం ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలు రాష్ట్రాన్ని అతలాకుతలం చేశాయి. పొంగిపొర్లిన వాగులు,వంకలు గ్రామాలను ముంచెత్తి గ్రామస్తులను కట్టుబట్టలతో మిగిల్చాయి. ఇక మోరంచ వాగు ఉధృతికి నిండా మునిగిపోయిన మోరంచపల్లి ప్రజల పరిస్థితి అత్యంత దారుణంగా మారింది. గత గురువారం వాగు నీటితో గ్రామం మొత్తం మునిగిపోవడంతో చెట్లెక్కి, బిల్డింగులు ఎక్కి ప్రాణాలను నిలబెట్టుకున్నారు గ్రామస్తులు. మరికొందరు ప్రాణాలను కాపాడుకోవడానికి ఊరిని వదిలిపెట్టి పరుగులు తీశారు.

Please help us..The villagers of Moranchapalli are waiting for your hand!

దీంతో ప్రాణాలు అయితే మిగిలాయి కాని..వరద కాస్త తగ్గిన తరువాత తిరిగి వచ్చి చూసుకునే సరికి ఏమీ మిగల్లేదు. వరద ఉధృతికి సరుకులన్నీ కొట్టుకుపోయాయి. ఇళ్లు మాత్రం నీళ్లు, బురదతో నిండుకొని ఉన్నాయి. ఇళ్లలో ఉన్న నిత్యావసర వస్తువులు,బియ్యం, ఉప్పు, పప్పు,కారాలతో పాటు వంట సామాగ్రి అంతా వాగులో కొట్టుకుపోయింది. ఇక ఇంట్లో మిగిలిన వస్తువులన్ని పాడైపోయాయి. దీంతో మోరంచపల్లి గ్రామస్తుల పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది.

వరద ఉధృతికి జలదిగ్బంధంలో చిక్కుకున్న మోరంపల్లి వాసులు సర్వం కోల్పోయిన నిరాశ్రయులై పుట్టెడు శోకంతో ఆపన్నహస్తం కోసం ఎదురుచూస్తున్నారు. అయితే ప్రభుత్వం నుంచి తక్షణ సహాయం అందలేదు. ప్రస్తుతానికి అయితే స్వచ్ఛంద సంస్థలే వారికి అండగా నిలుస్తున్నాయి. వారి దుస్థితి చూసిన స్వచ్చంద సంస్థలు వారికి నిత్యావసర సరుకులతో పాటు బియ్యం, దుప్పట్లు, చాపలు లాంటి సామాగ్రిని అందిస్తున్నాయి. జీఎంఆర్ ట్రస్ట్.. గ్రామంలోని ఒక్కొక్క కుటుంబానికి 4 వేల చొప్పున నగదును ఇస్తుంది. ఇక మాజీ సైనికులు ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేసి మందులు పంపిణీ చేశారు. కాగా, మోరంపల్లి గ్రామంలో 283 ఇళ్ళు ఉండగా.. సుమారు 985 మంది ప్రజలు నివసిస్తున్నారు.

గురువారం తెల్లవారు జామున ఈ గ్రామం మొత్తం నీటిలో మునిగిపోయింది. శుక్రవారం మధ్యాహ్నం నుంచి వరద తొలిగిపోవడంతో గ్రామస్తులు తిరిగి చేరుకున్నారు. అయితే ఇప్పటి వరకు  ప్రభుత్వం నుంచి తమకు పైసా సహాయం అందలేదని గ్రామస్తులు వాపోతున్నారు. ఇక ములుగు జిల్లా కొండాయిలో వరదలకు నిరాశ్రయులైన వారికి 25 కిలోల బియ్యంతో పాటు నెలరోజులకు సరిపడా నిత్యావసర సరుకులు తక్షణ సహాయం కింద మంత్రి సత్యవతి రాథోడ్ అందించారు.

కానీ, మోరంచపల్లి వాసులకు మాత్రం ఇప్పటి వరకు తక్షణ సాయం కింద ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయం అందకపోవడంతో వారు నిరాశ చెందుతున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు వచ్చి చూసి పోతున్నారే కాని.. సహాయం మాత్రం చేయడం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే తమను ఆదుకోవాలని మోరంపల్లి వాసులు చేతులెత్తి వేడుకుంటున్నారు.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు