తాడేపల్లిలో సీఎం జగన్‌తో రాజ్యసభ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ భేటీ అయ్యారు. రామచంద్రాపురం నియోజకవర్గంలో పరిస్థితులను జగన్‌కు ఆయన వివరించినట్లు తెలుస్తోంది. మంత్రి వేణు తన వర్గీయులపై అనుసరిస్తున్న తీరుపై ఫిర్యాదుచేశారు. ఎంపీ సమస్యలు విన్న సీఎం.. విభేదాలు పక్కనబెట్టి కలిసి పనిచేయాలని సూచించినట్లు సమాచారం. సీఎంతో భేటీ అనంతరం రీజనల్ కోఆర్డినేటర్ ఎంపీ మిథున్ రెడ్డితో బోస్ సమావేశమయ్యారు. నియోజవర్గంలో పరిస్థితులన్నీ జగన్‌కి చెప్పానని బోస్ తెలిపారు. సమయం వచ్చినప్పుడు అన్ని విషయాలు మాట్లాడతానని.. ప్రస్తుత పరిస్థితులపై అధిష్ఠానం నిర్ణయం తీసుకుంటుందని స్పష్టంచేశారు.
ఎన్నికల సమీపిస్తున్న వేళ అధికార వైసీపీలో వర్గ విభేదాలు ఎక్కువైపోతున్నాయి. ముఖ్యంగా రామచంద్రాపురం నియోజకవర్గంలో ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్, మంత్రి చెల్లుబోయిన వర్గీయుల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొంది. మంత్రిగా అయిన తర్వాత వేణు తమను పట్టించుకోవడంలేదని బోస్ వర్గీయులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. తమపై అక్రమకేసులు పెడుతూ భయభ్రాంతులకు గురిచేస్తున్నారని చెబుతున్నారు. మరోవైపు వచ్చే ఎన్నికల్లో తన కుమారుడు పిల్లి సూర్య ప్రకాష్ ను ఎమ్మెల్యేగా పోటీ చేయించేందుకు చంద్రబోస్ తెరవెనక ప్రయత్నాలు చేస్తున్నారు.
ఈ క్రమంలోనే సూర్యప్రకాష్ నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఇటీవల మంత్రి వేణుకు వ్యతిరేకంగా ఆత్మీయ సమావేశం కూడా ఏర్పాటుచేశారు. ఈ సమావేశంలో మంత్రిపై తీవ్ర విమర్శలు చేశారు. దీనిపై స్పందించిన వేణు.. ఎన్నికల్లో జగన్ తనను పోటీ చేయమన్నారని.. తన వెనక ప్రజలున్నారని కౌంటర్ ఎటాక్ చేశారు. దీంతో ఈ విభేదాలు శృతిమించడంతో అధిష్టానం రంగంలోకి దిగింది. కాగా గతంలో రామచంద్రాపురం నియోజకవర్గం నుంచి పిల్లి సుభాష్ చంద్రబోస్ ఎమ్మెల్యేగా కొనసాగారు. అయితే 2010లో వైసీపీ ప్రారంభించినప్పుడు మంత్రి పదవికి రాజీనామా చేసి జగన్ వెంట నడిచారు. ఆ తర్వాత జరిగిన ఉప ఎన్నికతో పాటు 2014 ఎన్నికల్లోనూ ఓడిపోయారు. 2019లో చెల్లుబోయిన వేణుకు జగన్ టికెట్ ఇచ్చారు. బోస్‌కు రాజ్యసభ పదవి కట్టబెట్టారు.