ఏపీలో వాలంటీర్లకు బిగ్ షాక్ మరో బిగ్ షాక్ తగిలే అవకాశం కనిపిస్తోంది. వాలంటీర్లను తొలగించాలని హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. వాలంటీర్ల నియామకాల్లో రిజర్వేషన్లు పాటించలేదన్న పిటిషనర్ కోర్టుకు తెలిపారు. ఈ పిటిషన్ ను విచారించిన న్యాయ స్థానం కౌంటర్ దాఖలు చేయాలని ఏపీ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. ఈ నెలలో పెన్షన్లను వాలంటీర్ల ద్వారా కాకుండా సచివాలయ ఉద్యోగులతో పంపింణీ చేయాలని ఇప్పటికే ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో తమను తప్పిస్తారేమోనన్న ఆందోళన వాలంటీర్లలో మొదలైంది. ఈ తరుణంలో వాలంటీర్లను తప్పించాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు కావడంతో వారి ఆందోళన రెట్టింపైంది. ఈ అంశంపై కోర్టు ఎలా స్పందిస్తుందనే అంశం ఏపీలో ఉత్కంఠగా మారింది.
ఏపీలో 2019 తర్వాత అధికారంలోకి వచ్చిన జగన్ సర్కార్ 2.65 లక్షల మంది వలంటీర్లను నియమించింది. ప్రతీ 50 ఇళ్లకు ఒక వాలంటీర్ చొప్పున నియామకం జరిగింది. వీరికి రూ.5 వేల చొప్పున గౌరవ వేతనం చెల్లించింది. వీరి ద్వారానే పింఛన్ల పంపిణీ, ప్రభుత్వ పథకాలకు లబ్ధిదారుల ఎంపిక జరిగేది. ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా ఉండేలా ఈ వాలంటీర్ వ్యవస్థను తీసుకువచ్చామని నాటి జగన్ సర్కార్ చెప్పింది. అయితే.. వైసీపీ కార్యకర్తలనే వాలంటీర్లుగా నియమించారని టీడీపీ నేతలు ఆరోపించారు. అయితే.. ఎన్నికల సమయంలో 1.03 లక్షల మంది రాజీనామా చేశారు. వీరిలో చాలా మంది వైసీపీ గెలుపుకోసం పని చేస్తామని ఆ సమయంలో బహిరంగంగానే చెప్పారు.
మళ్లీ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందనే ధీమాతోనే వీరు ఆ నిర్ణయం తీసుకున్నారు. కానీ ఎన్నికల తర్వాత ఏపీలో ప్రభుత్వం మారడంతో సీన్ రివర్స్ అయ్యింది. రాజీనామా చేసిన వాలంటీర్లు అంతా తమను విధుల్లోకి తీసుకోవాలని టీడీపీ ఎమ్మెల్యేలు, మంత్రుల చుట్టూ తిరుగుతున్నారు. వీరి గురించి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోకపోగా.. ఈ నెల పింఛన్ల పంపిణీని సచివాలయ సిబ్బంది ద్వారానే చేపడతామని ప్రభుత్వం ప్రకటన చేయడం ప్రస్తుతం విధుల్లో ఉన్న 1.64 లక్షల మంది వాలంటీర్లలోనూ ఆందోళన కలిగిస్తోంది. తాజాగా వాలంటీర్లను తొలగించాలని పిటిషన్ దాఖలు కావడంతో వీరి భవిష్యత్ మరింత ప్రశ్నార్థకంగా మారిందన్న చర్చ సాగుతోంది.