/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/rahul-gandhi-3-1-jpg.webp)
సార్వత్రిక ఎన్నికలకు మరో 10నెలలు మాత్రమే మిగిలి ఉండటంతో అన్ని పార్టీలు సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. ఇప్పటినుంచే అగ్రనేతలు పోటీచేసే నియోజకవర్గాల నుంచి జోరుగా చర్చ జరుగుతోంది. తాజాగా కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ ఈసారి ఏ నియోజవర్గం నుంచి పోటీ చేస్తారనే దానిపై ఆసక్తి నెలకొంది. మోదీ ఇంటిపేరు పరువునష్టం కేసులో సూరత్ కోర్టు అనర్హత వేటు వేసింది. దీంతో ఆయన పార్లమెంట్ సభ్యత్వం కోల్పోయారు. చివరకు సుప్రీంకోర్టు సూరత్ కోర్టు తీర్పుపై స్టే విధించడంతో మళ్లీ పార్లమెంట్‌లో అడుగుపెట్టారు. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో రాహుల్ గాంధీ మళ్లీ ఎక్కడ నుంచి పోటీలో ఉంటారనే చర్చ ప్రస్తుతం తీవ్రంగా జరుగుతోంది. అయితే గతంలో రాహుల్ ఉత్తరప్రదేశ్‌లోని అమేథీ నుంచి ప్రాతినిథ్యం వహించేవారు. 2019 ఎన్నికల్లో అమేథీతో పాటు వయనాడ్ నుంచి ఎంపీగా పోటీచేశారు. అమేథీలో కేంద్రమంత్రి స్మృతిఇరానీ చేతిలో ఓడిపోగా.. వయనాడ్‌లో గెలిచారు.
కానీ వచ్చే ఎన్నికల్లో తన సొంత నియోజకవర్గం అమేథీ నుంచి పోటీ చేయనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వార్తలకు బలం చేకూర్చేలా యూపీ పీసీసీ చీఫ్ అజయ్ రాయ్ వ్యాఖ్యానించారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో రాహుల్ గాంధీ అమేథీ నుంచే పోటీ చేస్తారని ఆయన వెల్లడించారు. రాహుల్ ఇక్కడి నుంచే పోటీచేయాలని అమేథీ నియోజకవర్గ ప్రజలు డిమాండ్ చేస్తున్నారని తెలిపారు. గత ఎన్నికల్లో తాము చేసిన పొరపాటుని మళ్లీ చేయకుండా రాహుల్‌ను భారీ మెజారిటీతో గెలిపించాలని భావిస్తున్నారని అజయ్ స్పష్టంచేశారు. ఇటీవలే అజయ్ రాయ్ యూపీ కాంగ్రెస్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు.
గత ఎన్నికల్లో అమేథీ నుంచి గెలిచిన స్మృతి ఇరానీ ఇచ్చిన హామీలు ఎటు పోయాయని ఆయన ఎద్దేవా చేశారు. 2004 నుంచి రాహుల్ గాంధీ వరుసగా యూపీలోని అమేథీ నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. అయితే 2019 సార్వత్రిక ఎన్నికల్లో రాహుల్ అమేథీ, కేరళలోని వయనాడ్ నుంచి పోటీ చేశారు. కేరళలో భారీ మెజార్టీతో విజయం సాధించిన రాహుల్.. అమేథీలో మాత్రం స్మృతి చేతిలో 55వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. యూపీ పీసీసీ చీఫ్ తాజా వ్యాఖ్యలను చూస్తుంటే కచ్చితంగా రాహుల్ అమేథీ నుంచి పోటీచేసే అవకాశాలు కన్పిస్తున్నాయి. అదే కనక నిజమైతే ఈసారి అక్కడ హోరాహోరీ పోటీ తప్పదు.