కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కార్గిల్ వార్ సమయంలో భారత ఆర్మీ నియంత్రణ రేఖను దాటలేదన్నారు. కావాలనుకుంటే భారత ఆర్మీ నియంత్రణ రేఖను దాటి వుండేదన్నారు. భారత్ తన గౌరవాన్ని కాపాడుకునేందుకు ఎల్ఓసీని దాటేందుకు కూడా రెడీ వుందని కీలక వ్యాఖ్యలు చేశారు.
24వ విజయ్ దివస్ సందర్భంగా రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కార్గిల్ వెళ్లారు. 1999 కార్గిల్ యుద్ధంలో అసువులు బాసిన జవాన్లకు ఆయన నివాళులు అర్పించారు అనతరం ఆయన మాట్లాడుతూ...భారత్ తన గౌరవాన్ని, ప్రతిష్టను కాపాడుకునేందుకు అవసరమైతే కశ్మీర్ లోని నియంత్రణ రేఖను దాటేందుకు కూడా రెడీగా వుందన్నారు.
అలాంటి పరిస్థితి వస్తే జవాన్లకు మద్దతుగా నిలిచేందుకు రెడీగా వుండాలని ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు. రష్యా-ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్దాన్ని ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు. ఉక్రెయిన్ యుద్ధంలో ఆ దేశ పౌరులు సైతం పాల్గొంటున్నారని తెలిపారు. అందుకే ఏడాదికి పైగా యుద్దం జరుగుతోందన్నారు.
మనల్ని పాకిస్తాన్ వెన్ను పోటు పొడిచిందన్నారు. భారత్ పై యుద్దానికి వచ్చిందన్నారు. ఆ యుద్ధంలో ప్రాణ త్యాగం చేసిన మన వీర సైనికులకు తాను సెల్యూట్ చేస్తున్నానని చెప్పారు. గతంలో యుద్దం వాతావరణం వచ్చినప్పుడల్లా సైన్యానికి ప్రజలు మద్దతుగా నిలిచారన్నారు. అదంతా పరోక్ష మద్దతు అని చెప్పారు. అవసరమైతే నేరుగా యుద్ధభూమిలో దూకి సైనికులకు మద్దతు ఇవ్వడానికి రెడీగా వుండాలని పిలుపునిచ్చారు.