ఫిబ్రవరి 13, 2014.. లోక్‌సభలో తెలంగాణ విభజన గురించి వాడివేడి చర్చ జరుగుతోంది. నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని అత్యంత ధనవంతులైన ఎంపీలలో ఒకరైన లగడపాటి రాజగోపాల్(Lagadapaati Rajgopal) సడన్‌గా జేబులో నుంచి ఏదో బాటిల్ తీశాడు. వెంటనే దాన్ని స్ప్రే చేయడం మొదలుపెట్టాడు. అంతే అక్కడున్న వారి కళ్లు మంటలు పుట్టాయి. కొంతమంది బలవంతంగా కళ్లు తెరిచినప్పటికీ వారికి ఏమీ కనపడలేదు. మరికొంతమంది ఆపుకోలేనంతగా దగ్గారు. మరికొంతమందికి శ్వాస తీసుకోవడం కష్టమైంది. బాధితుల్లో నాటి స్పికర్ మీరాకుమార్ కూడా ఉన్నారు. రాజగోపాల్ చేసిన నిర్వాకమేంటో తెలియడానికి ఎక్కువ సేపు పట్టలేదు. ఆయన ఉపయోగించిన పెప్పర్ స్ప్రే కారణంగా చాలామందికి ఆస్పత్రిలో చికిత్స తీసుకోవాల్సి వచ్చింది. తాజాగా పార్లమెంట్ ఆవరణతో పాటు లోక్‌సభలోకి ఆగంతకులు దూసుకురావడంతో మరోసారి పాత విషయాలను ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు.
అప్పుడేం జరిగిందంటే?
2014లో ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిన విషయం తెలిసిందే. ఈ విభజన బిల్లుకు నాడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రవేశపెట్టగా.. అందుకు బీజేపీ కూడా సపోర్ట్ చేసింది. అయితే ఈ విభజనను సీమాంధ్ర ఎంపీలు వ్యతిరేకించగా.. వారిలో నాటి విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపల్ కూడా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్‌ను విభజించి తెలంగాణ ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనపై ప్రధాని మన్మోహన్‌సింగ్‌పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టినందుకు గాను కాంగ్రెస్ బహిష్కరించిన ఆరుగురు ఎంపీల్లో రాజగోపాల్ కూడా ఉన్నారు. పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లును అడ్డుకునేందుకు చేయగలిగినదంతా చేస్తానని అంతకముందు అనేకసార్లు చెప్పిన రాజగోపాల్ పెప్పర్ స్ప్రె ఉపయోగించారు. ఈ ఘటనతో ఆయనపై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. అయినా తన చర్యను రాజగోపాల్ సమర్థించుకున్నారు. ఆత్మరక్షణ కోసమే ఇలా చేశానని చెప్పుకొచ్చారు. పెప్పర్ స్ప్రే ప్రాణంతకం కాదని.. రక్షణ కోసం పెప్పర్ స్ప్రే ఉపయోగించవచ్చని చెప్పారు. నిజానికి 2009లో తెలంగాణను ఏర్పాటు చేస్తామని కేంద్రం ప్రకటించిన వెంటనే తన రాజీనామాను పంపిన తొలి ఆంధ్రప్రదేశ్ ఎంపీ రాజగోపాల్‌నే. అయితే ఇలా లోక్‌సభలో పెప్పర్ స్ప్రే వాడడం ఆయన్ను విమర్శలు పాలు చేసింది. లోక్‌సభ ఎంపీల్లో వయసు ఎక్కువగా ఉండేవారు కూడా ఉంటారు. వారిలో శ్వాసకోస సంబంధిత వ్యాధులతో బాధ పడేవారు కూడా ఉంటారు. అయినా రాజగోపాల్ ఇలా చేయడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి.
ఇక తాజాగా లోక్‌సభలోకి ఇద్దరు వ్యక్తులు స్మోక్ స్టిక్స్ పట్టుకొచ్చారు. దీంతో నాటి లగడపాటి ఘటనను గుర్తు చేసుకుంటున్నారు సామాన్యులు.
Also Read: ఆహా.. ఓహో అన్నారు.. ఇదేనా పార్లమెంట్ భద్రత..? ఈ ఐదు ప్రశ్నలకు సమాధానాలేవి?