పాకిస్థాన్ క్రికెట్ బోర్డు తరచూ వార్తల్లో నిలుస్తోంది. గత కొన్ని నెలలుగా ఈ జట్టుపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. బోర్డు ఛైర్మన్ దగ్గర నుంచి ఆటగాళ్ల మార్పు వరకు పాక్ క్రికెట్ జట్టులో చాలా మార్పులు కనిపిస్తున్నాయి. గత నెలలో, షహీన్ షా అఫ్రిదిని T20 కెప్టెన్సీ నుండి తొలగించారు.బాబర్ ఆజం మళ్లీ జట్టుకు నాయకత్వం వహించారు. ఇప్పుడు పాకిస్థాన్ మాజీ ఆల్ రౌండర్ అజర్ మహమూద్‌ను అన్ని ఫార్మాట్లలో జట్టుకు అసిస్టెంట్ కోచ్‌గా నియమించారు.
ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ను ఈ ఏడాది జూన్ లో అమెరికా, వెస్టిండీస్ క్రికెట్ బోర్డు నిర్వహించనుంది. దీనికి ముందు జట్టును ప్రకటించి ఆతర్వాత టీ20 సిరీస్‌లో జట్లు ఆడాల్సి ఉంది. ఏప్రిల్ 18 నుండి న్యూజిలాండ్‌తో ప్రారంభమయ్యే హోమ్ సిరీస్‌కు మహమూద్‌ను తాత్కాలిక ప్రధాన కోచ్‌గా నియమించారు. విదేశీ కోచ్‌లు ఆస్ట్రేలియాకు చెందిన జాసన్ గిల్లెస్పీ ,దక్షిణాఫ్రికాకు చెందిన గ్యారీ కిర్‌స్టెన్‌లతో బోర్డు ఇంకా దీర్ఘకాలిక ఒప్పందాలను ప్రకటించలేదు.
గిల్లెస్పీ టెస్ట్ క్రికెట్‌లో ప్రధాన కోచ్‌గా వ్యవహరిస్తుండగా, వైట్ బాల్ ఫార్మాట్‌లో కిర్‌స్టన్ బాధ్యతలు స్వీకరిస్తారు. మూడు ఫార్మాట్లలో మహమూద్‌ను పీసీబీ అసిస్టెంట్ కోచ్‌గా నియమించవచ్చు. పాకిస్థాన్ బౌలింగ్ కోచ్‌గా ఉన్న మహమూద్ బ్రిటన్‌లో స్థిరపడి ఇంగ్లండ్ వేల్స్ క్రికెట్ బోర్డుకు గుర్తింపు పొందిన కోచ్‌గా ఉన్నారు. న్యూజిలాండ్‌తో జరిగే సిరీస్‌లో మహ్మద్ యూసుఫ్ బ్యాటింగ్ కోచ్‌గా, సయీద్ అజ్మల్ స్పిన్ బౌలింగ్ కోచ్‌గా వ్యవహరించనున్నారు.
భారత్ వేదికగా జరిగిన ఐసీసీ వన్డే ప్రపంచకప్‌లో పాకిస్థాన్ క్రికెట్ జట్టు ఘోర పరాజయం పాలైంది. తొలి రౌండ్ నుంచి నిష్క్రమించిన తర్వాత, జట్టు కెప్టెన్ బాబర్ ఆజం తన పదవిని విడిచిపెట్టాడు. అతను మూడు ఫార్మాట్ల కెప్టెన్సీకి రాజీనామా చేశాడు. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో అందరికీ తెలియజేశారు.