Rayudu vs Pawan: పవన్‌కల్యాణ్‌కి అంబటి రాయుడు కౌంటర్‌..బురద చల్లుతూనే ఉంటారులే అంటూ కామెంట్స్..!

వాలంటీర్లపై జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ చేసిన వ్యాఖ్యలపై వైసీపీ నుంచి విమర్శల దాడి కొనసాగుతూనే ఉంది. తాజాగా పవన్‌కి పరోక్ష చురకలంటించాడు మాజీ క్రికెటర్‌ అంబటిరాయుడు. మంచి పనులు చేసేటప్పుడు ఎవరో ఒకరు బురద చల్లుతూనే ఉంటారంటూ కౌంటర్ ఇచ్చాడు.

New Update
Rayudu vs Pawan: పవన్‌కల్యాణ్‌కి అంబటి రాయుడు కౌంటర్‌..బురద చల్లుతూనే ఉంటారులే అంటూ కామెంట్స్..!

ప్రస్తుతం ఏపీ రాజకీయాలు వాలంటీర్ల వ్యవస్థ చుట్టూ తిరుగుతున్నాయి. ఏలూరు బహిరంగ సభలో వాలంటీర్లపై వ్యక్తిగతంగా ఆరోపణలు గుప్పించిన జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌పై వైసీపీ ఎదురుదాడికి దిగింది. ఇప్పటికే మహిళా వాలంటీర్లు, వైసీపీ నేతలు పవన్‌పై మండిపడుతుండగా.. తాజాగా మాజీ క్రికెటర్‌ అంబటి రాయుడు ఈ ఎపిసోడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. పవన్‌ పేరు ఎత్తకుండానే జనసేన అధినేతపై ఫైర్ అయ్యాడు. మంచి పనులు చేసేటప్పుడు ఎవరో ఒకరు బురద చల్లుతూనే ఉంటారంటూ పవన్‌కు చురకలంటిచాడు రాయుడు.

వాలంటీర్లపై రాయుడు ప్రశంసలు:
ఏపీలో వాలంటీర్‌ వ్యవస్థ అద్భుతంగా పనిచేస్తుందన్నాడు రాయుడు. 70ఏళ్ల నుంచి జరగనది మన రాష్ట్రంలో వాలంటరీ వ్యవస్థ ద్వారా జరుగుతోందన్నారు. ప్రతి మనిషికి ఏది అందాలో అది వాలంటీర్ ద్వారా అందుతుందని చెప్పాడు రాయుడు. వాలంటరీ వ్యవస్థ ఏర్పాటు ఒక గొప్ప ఆలోచన అని.. ఈ సిస్టమ్‌ ద్వారా ప్రజలకు ఎంతో మంచి జరుగుతుందని ప్రశంసల వర్షం కురిపించారు. వాలంటరీ వ్యవస్థ మన రాష్ట్రానికి ఫ్లాగ్ షిప్ లాంటిదని కొనియాడారు. ప్రజలకు మంచిగా సేవలందించే వాలంటరీ వ్యవస్థ మన రాష్ట్రంలో తప్ప దేశంలో ఎక్కడా లేదన్న విషయం మరవద్దన్నాడు రాయుడు. కరోనా సమయంలో వాలంటీర్లు తమ ప్రాణాలను రిస్క్‌లో పెట్టి మరీ అందరికీ సేవలందించారన్నారు. మంచి జరుగుతున్నప్పుడు వ్యతిరేకంగా మాట్లాడేవాళ్లు ఉంటారని.. వాటిని మనం పట్టించుకోకూడదని వాలంటీర్లకు సూచించాడు రాయుడు.

publive-image రాయుడు, పవన్ (ఫైల్)

పరోక్షంగా పవన్‌నే అన్నాడు:
రాయుడు మాటల్లో ఎక్కడా పవన్‌ ప్రస్తావన లేనప్పటికీ అతని ఉద్దేశం మాత్రం క్లియర్‌కట్‌గా అర్థమవుతోంది. బురద జల్లే వాళ్లని పట్టించుకోవద్దంటూ పవన్‌ మాటలను పట్టించుకోవాల్సిన పని లేదని పరోక్షంగా చెప్పాడు రాయుడు. ఇటివలే క్రికెట్‌ కెరీర్‌కు వీడ్కోలు పలికిన రాయుడు ప్రస్తుతం ప్రజల మధ్యే ఉంటున్నారు. ఆయన వైసీపీలో చేరాతరన్న ప్రచారం చాలా కాలంగా ఉంది. ఇప్పటికే పలుమార్లు సీఎం జగన్‌ని కలిశారు రాయుడు. గుంటూరు నుంచి రాయుడికి ఎంపీ టికెట్ ఇస్తారన్న ప్రచారం జరుగుతోంది. కాపు కులానికి చెందిన రాయుడిని గుంటూరు ఎంపీగా కాకుండా ఎమ్మెల్యేగా పోటికి దింపాలని కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు. అటు వైసీపీ అధికారవర్గాల నుంచి మాత్రం ఇప్పటివరకు రాయుడు విషయంలో ఎలాంటి ప్రకటనా రాలేదు.

అసలేం జరిగిందంటే..?
రెండవ విడత వారాహి యాత్రను ఏలూరు నుంచి ప్రారంభించిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వైసీపీపై విమర్శలు చేసే క్రమంలో వాలంటీర్లను వ్యక్తిగతంగా టార్గెట్ చేశారు. గ్రామాల్లోని వాలంటీర్లు ప్రతి గ్రామంలో ఎవరు ఎవరి మనిషి, ఏ కుటుంబంలో ఎంతమంది ఉన్నారు, ఆడపిల్లలు ఎవరినైనా ప్రేమిస్తున్నారా లేదా, వితంతువులున్నారా లేదా అనే వివరాల్ని సేకరించి సంఘ విద్రోహ శక్తులకు చేరవేయడమే కాకుండా వాళ్లను ట్రాప్ చేసి హ్యూమన్ ట్రాఫికింగ్‌కు పాల్పడుతున్నారంటూ పవన్‌ చేసిన వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున రచ్చ కొనసాగుతోంది. పవన్ వ్యాఖ్యలపై అటు ఏపీ మహిళా కమిషన్‌ సీరియస్‌ అయ్యింది. వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాల్సిందిగా నోటీసులు జారీ చేసింది.

Advertisment
తాజా కథనాలు