Pawan kalyan TDP: 'ఐసీయూలో ఉన్న వైసీపీని చూస్తే జాలేస్తోంది'.. పవన్‌ కళ్యాణ్‌తో టీడీపీ నేతల భేటీ..!

ఒంటరిగా వెళితే అధికారంలో వస్తామా అనేది తనకు సందేహమేనన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. అలెయన్స్‌లో వెళితే మనకి బలమైన సీట్లు వస్తాయని మచిలీపట్నంలో టీడీపీ నేతలతో జరిగిన సమావేశంలో పవన్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ బలమైన పాదముద్ర ఉండబోతుందని.. జనసేన ,టీడపీ ఎదుగుతాయిన్నారు. భవిష్యత్‌లో అవనిగడ్డ, మచిలీపట్నం , పెడన , కైకలూరుని చతుర్ముక నగరంగా తీర్చుదిద్దుతామని స్పష్టం చేశారు.

New Update
Pawan kalyan TDP: 'ఐసీయూలో ఉన్న వైసీపీని చూస్తే జాలేస్తోంది'.. పవన్‌ కళ్యాణ్‌తో టీడీపీ నేతల భేటీ..!

వైసీపీవాళ్ళు ఎన్ని కుట్రలు చేసినా వచ్చేది జనసేన- తెలుగుదేశం ప్రభుత్వమేనన్నారు పవన్‌ కళ్యాణ్‌. మచిలీపట్నంలో టీడీపీ నేతలతో భేటీ అయ్యారు జనసేన అధినేత. పొత్తు ధర్మం పాటించి పరస్పరం సహకరించుకుందామని చెప్పారు. రాష్ట్రాన్ని అంధకారం నుంచి కచ్చితంగా బయటకు తీసుకొస్తామన్నారు పవన్‌ కళ్యాణ్‌. అభివృద్ధి జరగాలంటే కులాలను దాటి ఆలోచించాలని.. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాజధాని లేని రాష్ట్రంగా మిగిలిపోయిందన్నారు. దుర్మార్గ స్వభావం కలిగిన వ్యక్తి జగన్ అని అధికారం కోసం ఎంతకైనా తెగిస్తాడని నిప్పులు చెరిగారు.

కీలక భేటి:
మచిలీపట్నం నాయకులు, కార్యకర్తల సమావేశంలో జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘2024లో ఆంధ్రప్రదేశ్ బంగారు భవిష్యత్తు ఉండాలనే బలమైన సంకల్పంతోనే పొత్తు నిర్ణయం తీసుకున్నాం. రాజ్యాధికారం అనే రక్తం మరిగిన వైసీపీ నాయకుడిని ఇంటికి పంపిచడమే ముందున్న లక్ష్యం. అధికారాన్ని వదులుకోవడానికి ఇష్టపడని వైసీపీ ఎన్నికల ముందు మరిన్ని ఇబ్బందులకు గురి చేస్తుంది. ఇప్పటికే రాష్ట్రంలో 26 లక్షల పైచిలుకు దొంగ ఓట్లు బయటపడ్డాయి. వైసీపీ ఎన్ని కుయుక్తులు పన్నినా కచ్చితంగా వచ్చే ఎన్నికల్లో మనం గెలుస్తున్నాం. గెలుపు నిష్పత్తి బట్టి పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవుతాడా? లేదా? అనేది ఎన్నికల ఫలితాల తరువాత నిర్ణయిద్దామ’ని పవన్ పేర్కొన్నారు.

publive-image మచిలీపట్నంలో టీడీపీ నేతలతో పవన్ సమావేశం

ఏం చర్చించారు? :
సోమవారం మచిలీపట్నంలో జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ... “వైసీపీ నాయకుడు డ్రాకులా మాదిరిగా అధికారానికి అలవాటుపడ్డాడు. దానిని వదులుకోవడానికి సిద్ధంగా లేడు. జగన్‌ను టీనేజ్ నుంచి గమనిస్తున్నానని.. కడప జిల్లాలో ఒక పోలీస్ అధికారిని లాకప్‌లో వేసి దాడి చేసిన నైజం అతనిది. జగన్ స్వభావం కూడా అత్యంత దూకుడు, దుర్మార్గంగా ఉంటుందని చాలా మంది సన్నిహితులు చెప్పేవారు. తెలంగాణలో జగన్ బ్యాచ్ చేసిన దోపిడీ అంతాఇంతా కాదు. వారి దోపిడీని భరించలేక తెలంగాణ యువత తిరుగుబాటు చేసింది. ఇలాంటి వ్యక్తి ఆంధ్రప్రదేశ్ కు హానికరం అని భావించే మొదటి నుంచి వైసీపీ ఆంధ్రప్రదేశ్ కు హానికరమని చెబుతున్నాను. ఇప్పుడు ఆంధ్ర ప్రజలు ప్రత్యక్షంగా అతను పెడుతున్న బాధలు అనుభవిస్తున్నారు' అని చెప్పారు.

ప్రజలు కోరుకున్న పొత్తు ఇది:
జనసేన పార్టీ వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా వెళ్తే బలమైన సీట్లు సాధించేది. అయితే అధికారం సాధించేందుకు మన బలం సరిపోతుందా? లేదా? అన్న ప్రశ్నకు సమాధానం లేదు. ప్రజలు సైతం జనసేన పార్టీని నమ్ముతున్నప్పటికీ అధికారం సాధించే దిశగా పార్టీ ప్రయాణం చేస్తుందా? లేదా? అనే సందేహంలో ఉన్నారు. తెలుగుదేశం పార్టీతో పొత్తు ద్వారా కచ్చితంగా వచ్చే ఎన్నికల్లో అధికారం సాధిస్తామనే నమ్మకం ప్రజల్లోనూ కలిగింది. జగన్ లాంటి వ్యక్తిని ధీటుగా ఎదుర్కొవాలంటే రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలి అంటే కచ్చితంగా కలిసి పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. దీనిని ప్రజలు కూడా ముక్త కంఠంతో ఆమోదిస్తున్నారు. జనసేన తెలుగుదేశం పార్టీల పొత్తు ప్రజలు నిర్ణయించిన పొత్తు. వారు కోరుకున్న పొత్తు. రాజకీయాల్లో ప్రజల కోసం మాత్రమే పని చేయాలి. వారి ఉన్నతి కోసమే ఆలోచించాలి. వ్యక్తిగత లెక్కలు ఏమీ ఉండవు. జనసేన పార్టీ రోడ్ల మీద పోరాటం చేసే పార్టీగానే ఉండిపోకూడదు. రాజ్యాధికారం దిశగా ప్రయాణం చేయడం అవసరం. మన దగ్గర సమస్యలు చెప్పుకోవడానికి వచ్చిన వారికి పరిష్కారం చూపించే విధంగా మనం తయారవ్వాలని పవన్ చెప్పారు.

publive-image టీడీపీ మచిలీపట్నం నేతలు

సహకారం, సంఘర్షణ రెండు కీలకమే:
రాజకీయాల్లో అవసరం మేరకు కలుస్తామని చెప్పారు పవన్‌ కళ్యాణ్. తాను తెలుగుదేశం పార్టీతో గతంలో విభేదించిన మాట వాస్తవమని.. రాజధానికి 33 వేల ఎకరాలు ఒకేసారి సేకరించడం మీద విభేదించానన్నారు. హైదరాబాద్ నగరం మాదిరి అంచలంచెలుగా ఎదగాలని భావించానన్నారు. క్రమక్రమంగా రాజధాని ఉన్నత దశకు వెళ్తుందని నమ్మానని తెలిపారు పవన్‌. 'ఆ విషయంలో తెలుగుదేశం పార్టీ విధానం విషయంలో విభేదించాను. అయితే ప్రస్తుతం అంధకారంలోకి వెళ్లిపోతున్న ఆంధ్రప్రదేశ్ ను రక్షించుకోవడం కోసం పరస్పర సహకారం అవసరం. రాజకీయాల్లో వ్యూహాలే ఉంటాయి. ముఖ్యంగా సహకారం, సంఘర్షణ కీలకం. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ భావి భవిష్యత్తు బాగుండాలి అంటే సహకారం అవసరం. 2024లో సహకరించుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి. దీనివల్ల జనసేన ఎదుగుతుంది. తెలుగుదేశం స్థిరపడుతుంది. ఇంకా మాతో కలిసి పని చేయాలి అనుకునే వారిని కూడా కలుపుకొని వెళ్తాం' అని పవన్‌ అభిప్రాయపడ్డారు.

ఆరు నెలల్లో ఇంటికి వెళ్తున్నారు జాగ్రత్తగా ఉండండి
వైసీపీ నేతలు మరో 6 నెలల్లో ఇంటికి వెళ్లబోతున్నారు. ఇష్టానుసారం ప్రవర్తించకండి. మా నాయకులను, కార్యకర్తలను కేసులు, దాడులు పేరుతో భయపెట్టకండి. భవిష్యత్తులో వైసీపీ నాయకులు జనసేన కార్యకర్తల దగ్గరకే వచ్చి కాస్త సహాయం చేయండి అని అడిగే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. అధికారులు, పోలీసులు కూడా దీనిని గుర్తుపెట్టుకోండి. మరో ఆరు నెలల్లో పోతున్నారు. పద్దతిగా ఉండండి. ప్రస్తుతం వైసీపీ నాయకులు, కార్యకర్తల ఫ్రస్టేషన్ చూస్తుంటే పాపం అనిపిస్తుంది. ఐసీయూలో ఉన్న వైసీపీని చూస్తే జాలి వేస్తుంది. కొండ అంచుకు వెళ్ళి దూకేసే వాడిని చూసి ఏం చేయగలం? ఓడిపోయే పార్టీలోని ఓడిపోయే నాయకులు ఇష్టానుసారం మాట్లాడుతున్నారు జన సైనికులు వారిని పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు పవన్.

ALSO READ: తెలంగాణ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. పీఆర్సీపై కీలక ఉత్తర్వులు జారీ!

Advertisment
తాజా కథనాలు