టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో ఆయనను పరామర్శించేందుకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ విజయవాడ రానున్నారు. మధ్యాహ్నం 3గంటలకు హైదరాబాద్ నుంచి గన్నవరం విమానాశ్రయం చేరుకుని అక్కడి నుంచి విజయవాడ చేరుకుంటారు. అనంతరం చంద్రబాబును కలిసి ఆయనకు మద్దతు ప్రకటించనున్నారు.
ఇప్పటికే చంద్రబాబు అరెస్టును తీవ్రంగా ఖండించారు జనసేనాని. ప్రాథమిక ఆధారాలను చూపించకుండా అర్థరాత్రి అరెస్ట్ చేయడం దుర్మార్గం అన్నారు. విశాఖపట్నంలో కూడా జనసేన పట్ల ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగిందని..ఏ తప్పూ చేయని నాయకులపై మర్డర్ కేసులు పెట్టి జైలులో పెడుతున్నారంటూ విమర్శించారు. పాలన పరంగా అనుభవం ఉన్న వ్యక్తి పట్ల ప్రభుత్వ తీరు సరైంది కాదన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే అంశంలో ప్రభుత్వం పోలీసులు అందరి పట్ల ఒకలా వ్యవహరించాలని సూచించారు. అరెస్టుపై నిరసన తెలిపితే హౌస్ అరెస్టులు చేస్తారా? అంటూ మండిపడ్డారు.
అక్రమాలు చేసి జైలుకి వెళ్లిన వాళ్ళు విదేశాలకు వెల్లోచ్చు కానీ,.. చంద్రబాబు మద్దతుగా నిరసనలు తెలిపితే తప్పా అంటూ ప్రశ్నించారు. చంద్రబాబు అరెస్ట్ లా అండ్ ఆర్డర్ అంశం పూర్తిగా కక్ష సాధింపు చర్యేనని జనసేనాని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబుకు అండగా ఉంటానని..తనకు మద్దతు తెలుపుతున్నాని పవన్ వ్యాఖ్యనించారు.