TDP Leader Varma : ఇటీవల పిఠాపురం (Pithapuram) నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి వర్మ (Varma) పై కొందరు జనసేన నేతలు దాడికి దిగిన విషయం తెలిసిందే. ఈ దాడిలో వర్మ కు చెందిన కారు పూర్తిగా ధ్వంసమైంది. వర్మకు సైతం గాయాలు అయ్యాయి. పవన్ కోసం తన సీటును త్యాగం చేసి ఆయన గెలుపులో కీలక పాత్ర పోషించిన వర్మపై జనసేన నేతలు దాడికి దిగడం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. అయితే.. ఇది పవన్ కు సంబంధం లేదని.. జనసేనలో కొత్తగా చేరిన వారు చేసిన పని అంటూ వర్మ ప్రకటించారు. ఈ దాడిలో జనసేన నేతలు ఎవరైనా ఉంటే చర్యలు ఉంటాయని నిన్న నాగబాబు ప్రకటన విడుదల చేశారు.
ఈ నేపథ్యంలో ఈ రోజు పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ఈ రోజు పిఠాపురంలో పర్యటిస్తుండడం ఆసక్తికరంగా మారింది. కొద్ది సేపటి క్రితం పవన్ కల్యాణ్ ఢిల్లీ నుంచి విశాఖ చేరుకున్నారు. ప్రత్యేక విమానంలో బీజేపీ ఎంపీ సీఎం రమేష్ తో కలిసి ఆయన విశాఖకు వచ్చారు. అక్కడి నుంచి నేరుగా పిఠాపురం వెళ్లనున్నారు పవర్ స్టార్. నియోజకవర్గానికి చెందిన పార్టీ నేతలతో పవన్ సమావేశం కానున్నారు. టీడీపీ - జనసేన (TDP - Janasena) నేతల మధ్య నెలకొన్న అసమ్మతిపై పవన్ కల్యాణ్ ఈ సమావేశంలో చర్చించనున్నట్లు తెలుస్తోంది.
ఇరు పార్టీ నేతలతో ఆయన మాట్లాడనున్నట్లు సమాచారం. పిఠాపురం టీడీపీ ఇన్ఛార్జి వర్మపై దాడి చేసిందెవరు? అసలేం జరిగింది? అన్న విషయాలపై పవన్ వివరాలు సేకరించనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పవన్ ఏం మాట్లాడుతారు? ఎలాంటి ప్రకటన చేస్తారు? అన్న అంశంపై ఆసక్తి నెలకొంది.
Also Read : ఉమ్మడి కర్నూలు జిల్లాలో కొనసాగుతున్న ప్రతీకార దాడులు.!