– వారాహి యాత్రతో జనసేనలో జోష్
– తనదైన రీతిలో పంచ్ లు విసురుతున్న పవన్
– ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని విమర్శలు
– సీఎం అవుతానని గట్టిగా చెబుతున్న జనసేనాని
– పవన్ వ్యాఖ్యల వెనుక వ్యూహం ఏంటి?
– నిజంగా జనసేన పుంజుకుందా..?
– లేక ఇంకేదైనా ఉస్తాద్ ప్లాన్ ఉందా..?
ఈమధ్య ఎక్కడికి వెళ్లినా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సీఎం నామస్మరణ చేస్తున్నారు. ముఖ్యమంత్రిని అవుతా.. జనం కూడా ఆలోచన చేయాలని కోరుతున్నారు. జగన్ పాలనలో రాష్ట్రం నాశనం అయిందని.. ఒక్క ఛాన్స్ ప్లీజ్ అంటూ వేడుకుంటున్నారు. అసలు.. పవన్ ధీమా ఏంటి..? సీఎం అవుతానంటున్న ఆయన వ్యూహాలేంటి..? అంటూ రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఈ క్రమంలోనే అనేక అంశాలు తెరపైకి వస్తున్నాయి.
2014 ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్న జనసేన.. 2019లో రంగంలోకి దిగి కేవలం ఒక్క స్థానాన్ని మాత్రమే సాధించుకుంది. 7 శాతం ఓట్ షేర్ తో పరాజయాన్ని మూటగట్టుకుంది. అయితే.. ఈసారి మాత్రం పవన్ చాలా కాన్ఫిడెంట్ గా జనసేన విజయాన్ని చెబుతున్నారు. కచ్చితంగా సీఎం అవుతానని అంటున్నారు. వారాహి యాత్ర సందర్భంగా ఈ విషయాన్ని పదేపదే జనానికి వినిపిస్తున్నారు. సీఎం అవుతా.. ఒక్క ఛాన్స్ ఇచ్చి చూడండని అడుగుతున్నారు.
గతంలో సీఎం కావడం కన్నా వైసీపీని ఓడించడమే తన ముఖ్యమని అన్నారు పవన్. కానీ, ఈసారి టోన్ మారింది. అసెంబ్లీలో అడుగుపెడతానని.. సీఎం అవుతానని అంటున్నారు. ఈ నేపథ్యంలో మూడు అంశాలపై తీవ్రంగా చర్చ జరుగుతోంది.
1. టీడీపీతో సీట్ల పంపకం విషయంలో ఒత్తిడి
2. కాపు సామాజిక వర్గంలో జోష్
3. సీఎం సీటు అంశంలో షేరింగ్ ఫార్ములా
ఈ మూడింటిని లక్ష్యంగా చేసుకునే పవన్ తాజా వ్యాఖ్యలు ఉంటున్నాయని అనుకుంటున్నారు.
కొన్నాళ్లుగా చంద్రబాబు, పవన్ భేటీ అవుతున్నారు. వీళ్లు కలిసినప్పుడల్లా.. పొత్తు ఫిక్స్ అని ప్రచారం సాగుతోంది. జనసేన ప్రస్తుతం బీజేపీతో పొత్తులో ఉంది. అయితే.. టీడీపీతో కలిసేందుకు రాష్ట్ర బీజేపీ నాయకత్వం సుముఖంగా లేదు. కానీ, కేంద్ర నాయకత్వం ఆదేశిస్తే ఏదైనా జరగొచ్చు. అందుకే, కొన్నాళ్లుగా బీజేపీ అగ్ర నేతలతో చంద్రబాబు సఖ్యత పెంచుకుంటున్నారనే టాక్ ఉంది. టీడీపీ, జనసేన, బీజేపీ కలిస్తే పరిస్థితి వేరేలా ఉంటుంది. విజయం పక్కా అవుతుంది. 2014లో జరిగింది ఇదే. ఇప్పుడు మరోసారి అదే స్ట్రాటజీ దిశగా అడుగులు పడుతున్నాయనే ప్రచారం సాగుతోంది. ఈక్రమంలోనే సీట్ల అంశంలో చంద్రబాబుపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు పవన్ ప్రయత్నాలు మొదలు పెట్టారనే చర్చ జరుగుతోంది. ఇంకోవైపు సీఎం సీటు అంశంలో షేరింగ్ ఫార్ములాను కూడా తెరపైకి తెచ్చే ప్రయత్నమా? అనే సందేహం కూడా వ్యక్తమౌతోంది.
మరోవైపు, కాపు సామాజికవర్గంలో జోష్ నింపే ప్రయత్నంలో భాగంగా కూడా పవన్ వ్యాఖ్యలు ఉంటున్నాయనేది ఇంకో వాదన. జనసేనకు కులం రంగు పులమొద్దని పవన్ ముందు నుంచి చెబుతున్నారు. కానీ, ఈ పార్టీని కాపు సామాజిక వర్గమే బాగా ఓన్ చేసుకుంది. చిరంజీవి ప్రజారాజ్యంతో జరిగిన డ్యామేజ్ ను జనసేనతో పవన్ పూడ్చుతారన్న నమ్మకంతో కాపులు ఉన్నారు. సీఎం సీటు కలను నెరవేరుస్తారనే ఆశతో చూస్తున్నారు. అయితే.. కొందరికి పొత్తుల విషయంలో అసహనం ఉన్న నేపథ్యంలో పవన్ సీఎం నామస్మరణ చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది.