మూడు పార్టీలు కలిసే పోటీ చేస్తాయి..
ఎన్డీయే కూటమి భేటీలో పాల్గొనేందుకు ఢిల్లీ వెళ్లిన జనసేనాని పవన్ కల్యాణ్ పొత్తుల అంశంపై మరోసారి స్పందించారు. టీడీపీ, బీజేపీ, జనసేన కలిసే పోటీ చేస్తాయని తెలిపారు. అయితే టీడీపీ, బీజేపీ మధ్య కొన్ని భేదాభిప్రాయాలు ఉన్నాయని.. అవి త్వరలోనే పరిష్కారం అవుతాయని ఆశిస్తున్నట్లు వెల్లడించారు. అయితే కచ్చితంగా మూడు పార్టీలు కలిసే పోటీ చేస్తాయని తాను భావిస్తున్నట్లు ఆశాభావం వ్యక్తంచేశారు. 2014లో ఎలాగైతే కలిసి అధికారంలోకి వచ్చామో.. 2024లో కూడా అలాగే పవర్‌లోకి వస్తామని పేర్కొన్నారు.
సీఎం పదవి ముఖ్యం కాదు..
జనసేన కార్యకర్తలు తనను సీఎం చేయాలని అనుకుంటున్నారని.. అయితే క్షేత్రస్థాయి బలాబలాల ఆధారంగా నిర్ణయాలు ఉంటాయన్నారు. తనకు ముఖ్యమంత్రి పదవి ముఖ్యం కాదని మరోసారి స్పష్టంచేశారు. అరాచక వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించడమే తన ముందున్న కర్తవ్యమన్నారు. ఫలితాలు వచ్చాక సీట్లను బట్టి సీఎం పదవి గురించి ఆలోచిస్తామని క్లారిటీ ఇచ్చారు. వారాహి యాత్రతో జనసేనకు ప్రజల్లో మంచి ఆదరణ లభిస్తుందన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రత సమస్యలు ఉన్నాయని.. విచ్చలవిడిగా అవినీతి జరుగుతుందని పవన్ ఆరోపించారు.
ఏపీలో డేటా చోర్యం జరుగుతోంది..
ముఖ్యంగా ఏపీ డేటా చోర్యం జరుగుతోందని మరోసారి వ్యాఖ్యానించారు. వాలంటీర్లు ద్వారా ఆధార్, వేలిముద్రలు, పర్సనల్ డేటా అంతా చోరీ చేసి తెలంగాణలోని హైదరాబాద్‌లో దాస్తున్నారన్నారు. దీనిపై తన పోరాటం కొనసాగిస్తానని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఏ వర్గం ప్రజలు సంతోషంగా లేరని.. అందరూ నిరాశ, నిస్పృహలతో ఉన్నారని చెప్పారు. ఉద్యోగాలు లేవని.. ప్రభుత్వ ఉద్యోగులకు ఒకటో తేదీ జీతం ఇచ్చే పరిస్థితి లేదన్నారు. కాంట్రాక్టర్లకు కూడా సకాలంలో బిల్లులు చెల్లించే పరిస్థితి లేదని సేనాని వెల్లడించారు.