Pawan Kalyan: పర్యావరణ పరిరక్షణకై ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తొలి అడుగు వేశారు. నెల రోజులు ముందే పిఠాపురం నియోజకవర్గం చేబ్రోలులోని తన నివాసంలో వినాయక మండపం ఏర్పాటు చేశారు. తన మండపంలో పర్యావరణానికి హాని లేకుండా ఉండే మట్టి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. పర్యావరణానికి హాని కలిగించే ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలు వాడకుండా ముందు నుంచే తన నియోజకవర్గ ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు.
మట్టి మన సంస్కృతి ..ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విదేశీ సంస్కృతి.. అంటూ నినాదంతో ముందుకు వెళ్తున్నారు. పర్యావరణ శాఖ మంత్రిగా తన బాధ్యతను నెరవేర్చే విధంగా..జన సైనికులకు నియోజకవర్గ ప్రజలు వన్నెతెచ్చే విధంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. పకృతి ప్రేమికులు విజయరామ్ సూచనలతో.. అన్ని కుల వృత్తుల సమ్మేళనంతో మట్టి విగ్రహాల ఏర్పాటుకు సూచనలు చేశారు. మట్టి కుమ్మరి, గడ్డి, కర్రలు, వస్త్రాలు చేనేత, తాటాకు గొడుగులు, గోను సంచులతో మండపం, పైన కొబ్బరి ఆకుల పందిరి, వరి కంకులు, అరటి చెట్లు, పూలు వీటిని మాత్రమే ఉపయోగించి మండపంను ఏర్పాటు చేసుకోవచ్చని నమూనా సిద్దం చేశారు.
ప్లాస్టిక్ కవర్ వాడకుండా బజారుకు వేళ్ళాలని సూచిస్తూ క్లాత్ చిక్కం ఉపయోగించాలని వినాయక చేతికి తగిలించి అవగాహన కల్పిస్తున్నారు. అందరూ కలిసి తమ తమ ఊరిలో ఇలా ఒక విగ్రహాన్ని ఏర్పాటు చేస్తే పర్యావరణానికి హాని ఉండదన్నారు. నీటిలో నిమజ్జనం చేస్తే జలాలు కలుషితం కావని ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలను నిషేధించే విధంగా అందరూ కృషి చేయాలని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆలోచన. రాబోయే వినాయక చవితికి అందరూ మట్టి విగ్రహాలు ఏర్పాటు చేస్తే పర్యావరణాన్ని రక్షించుకోవచ్చు అనే విధంగా తన సొంత నియోజకవర్గ నుంచే పవన్ కళ్యాణ్ మొదలు పెడుతున్నారు.