Pawan Kalyan Donates Rs 10 Crore to JanaSena: పార్టీ నిధి కోసం 10కోట్ల రూపాయల విరాళం ప్రకటించారు పవన్ కల్యాణ్. ఉమ్మడి విశాఖ జిల్లాల జనసేన నేతలతో పవన్ కీలక వ్యాఖ్యలు చేశారు. మన కూటమి అధికారంలోకి వస్తుందని.. పార్టీ కోసం పనిచేసిన వారికి సముచిత స్థానం కల్పించే బాధ్యత తనదేనన్నారు పవన్ (Pawan Kalyan). 2019 తర్వాత పార్టీకి అండగా నిలిచిన వాళ్ళను భరోసా ఇచ్చానని చెప్పారు. ఇప్పుడు వచ్చే టిక్కెట్లు కాదు.. భవిష్యత్తులో మనకు మరిన్ని పదవులు రాబోతున్నాయని తెలిపారు.
మన కూటమి అధికారంలోకి వస్తోంది:
పార్టీ కోసం పని చేసిన వారందరికీ సముచిత గౌరవం కల్పించే బాధ్యత తీసుకుంటానని పవన్ చెప్పుకొచ్చారు. వ్యక్తిగత ప్రయోజనాల కోసం కాదు రాష్ట్ర అభివృద్ధి... పార్టీ బలోపేతం కోసమే నిర్ణయాలు తీసుకుంటానని తెలిపారు. రాష్ట్రంలో ప్రజలు స్పష్టమైన తీర్పు ఇవ్వబోతున్నారని.. మన కూటమి అధికారంలోకి వస్తోందని స్పష్టం చేశారు. క్షేత్ర స్థాయి నుంచి మన బలాన్ని సద్వినియోగపరచుకొంటూ కూటమిని గెలుపు దిశగా తీసుకువెళ్ళేందుకు ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాలి అన్నారు. వ్యక్తిగతంగా నా గెలుపు గురించి కాదు.. సమష్టి గెలుపు కోసమే తొలి నుంచీ నా వ్యూహం, అడుగులు ఉంటున్నాయని తెలిపారు. ఆదివారం రాత్రి విశాఖపట్నం చేరుకున్న పవన్ తొలుత మర్యాదపూర్వకంగా పార్టీ నాయకులు కొణతాల రామకృష్ణ ఇంటికి వెళ్లారు. దాదాపు గంటపాటు వారిద్దరూ పార్టీ కార్యక్రమాలు, ఎన్నికల్లో అనుసరించే విధానాలపై చర్చించారు. తర్వాత విశాఖపట్నం, అనకాపల్లి నియోజక వర్గాలకు చెందిన పార్టీ ముఖ్య నేతలతో సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబాబు (Nagababu) పాల్గొన్నారు. సోమవారం ఉదయం ఉమ్మడి జిల్లా నాయకులతో ముఖాముఖీ భేటీలు నిర్వహించారు. వీర మహిళ విభాగం ప్రాంతీయ సమన్వయకర్తలతో సమావేశమయ్యారు.
జనసేన (Janasena) కోసం తపించి పని చేసిన ప్రతి ఒక్కరికీ సముచిత గౌరవం కల్పించే బాధ్యత తీసుకుంటానని భరోసా ఇచ్చారు. 2019 తరువాత పార్టీ బలంగా నిలిచేందుకు దోహదపడ్డ నాయకులకు అండగా ఉంటానని చెప్పారు. ప్రజారాజ్యం సమయంలో ఉన్న ఒక చిన్న పరిచయంతో ఒక నాయకుడికి 2014 తరవాత టీటీడీ సభ్యుడిగా రెండు పర్యాయాలు పదవి ఇప్పించగలిగానని... అప్పటికి ఆయన మన పార్టీలోకి రాలేదని ఉదహరిస్తూ- జనసేన కోసం నిలిచిన ఎవర్నీ విస్మరించేది లేదు అన్నారు.
ఇప్పటి ఎన్నికల్లో స్థానాలు మాత్రమే కాకుండా, కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక వచ్చే అవకాశాలనూ దృష్టిలో ఉంచుకోవాలని సూచించారు. స్థానిక ఎన్నికల్లో కావచ్చు, పీఏసీఎస్‌ల్లో ఇతర కీలక నామినేటెడ్ పదవుల్లో సముచిత స్థానాలు మనకు దక్కుతాయి.. తద్వారా అందరినీ బలోపేతం చేసి ముందుకు వెళ్లామని తెలిపారు. మూడింట ఒక వంతు పదవులు దక్కించుకుందాం అన్నారు. ఆంధ్ర ప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్రానికి సుస్థిర పాలన అవసరమని, అప్పుడే అభివృద్ధి సాధ్యమనీ.. అలాంటి సుస్థిర పాలన మన కూటమి అందించగలదని ఆర్థిక నిపుణులు, పారిశ్రామికవేత్తలు స్పష్టంగా చెపుతున్నారని తెలిపారు. ఇటీవల తనను కలిసిన పారిశ్రామికవేత్తలు చెప్పిన విషయాలను పంచుకున్నారు.