CM KCR: మెదక్ పర్యటనకు వెళ్తున్న సీఎం కేసీఆర్ కు పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి గుమ్మడిదల మండలం టోల్ ప్లాజా దగ్గర ఘన స్వాగతం పలికారు. ఈ క్రమంలో భారీగా అక్కడికి వచ్చిన జనం కేసీఆర్ కు ఆహ్వానం పలికారు. కళాకారులు డప్పు చప్పుళ్లు, ప్రదర్శనలతో అదరగొట్టారు.
ఇక కేసీఆర్ పటాన్ చెరు ప్రాంత రైతులకు ఓ శుభ వార్త చెప్పారు. సాగు నీరు లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్న పటాన్ చెరుకు త్వరలోనే కాళేశ్వరం జలాలు తీసుకొని వస్తామన్నారు. దీంతో ఆ ప్రాంత అన్నదాతల సాగునీటి సమస్యలు తీరుతాయన్నారు. ఇక మరోసారి బీఆర్ఎస్ ను రాష్ట్ర ప్రజలు ఆశీర్వదించాలన్నారు సీఎం కేసీఆర్. మరోసారి బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత మరింత అద్భుతమైన అభివృద్ధిని చేసుకుందామన్నారు.
తరువాత అక్కడి నుంచి మెదక్ జిల్లాకు చేరుకున్న సీఎం కేసీఆర్ అత్యాధునిక హంగులతో నిర్మించిన BRS పార్టీ జిల్లా కార్యాలయాన్ని ప్రారంభించారు. అయితే ఎకరం స్థలంలో 60 లక్షల వ్యయంతో నిర్మించిన పార్టీ కార్యాలయం..ఇక నుంచి సభలు, సమావేశాలకు వేదిక కానుంది. ఈ జిల్లా కార్యాలయంలో మీటింగ్ పెట్టుకోవడానికి ప్రత్యేకంగా పెద్ద హాల్ ను నిర్మించారు.