పశ్చిమ బెంగాల్, కోల్‌కతాలోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో బుధవారం అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటన కలకలం రేపింది. బుధవారం రాత్రి 9.20గంటలకు ఎయిర్ పోర్టులోని చెక్-ఇన్ ఏరియాలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. దీంతో వెంటనే ప్రయాణికులు భయంతో పరుగులు పెట్టారు. దట్టమైన పొగ ఎయిర్ పోర్టులో కమ్మేసింది. ఈఘటనపై సమాచారం అందుకున్న సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు. రెండు ఫైరింజన్ల సాయంతో దాదాపు 20 నిమిషాలపాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. షార్ట్ సర్య్కూట్ వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు ఎయిర్ పోర్టులు అధికారులు వెల్లడించారు.
ప్రయాణికులందరినీ సురక్షితంగా తరలించామని, చెక్-ఇన్ ప్రాంతంలో పొగలు కమ్ముకోవడంతో చెక్-ఇన్ ప్రక్రియను నిలిపివేసినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణాపాయం జరగలేదన్నారు. CISF ప్రకారం, D పోర్టల్ చెక్-ఇన్ కౌంటర్లో మంటలు చెలరేగాయి. పొగలు రావడంతో టెర్మినల్ భవనం నుంచి ప్రయాణికులు, సిబ్బందిని ఖాళీ చేయించారు. ఎవరూ గాయపడినట్లు సమాచారం లేదు. మంటలను ఆర్పివేశారు. సాధారణ కార్యకలాపాలు పునరుద్ధరించారు. అయితే ఈ ప్రమాదం ఎలా జరిగిందన్న అంశంపై దర్యాప్తు చేపట్టారు.