మరో సంచలనం దిశగా కేంద్రం.. 18 ఏళ్లకే ఎన్నికల్లో పోటీకి అవకాశం!

మరికొన్ని నెలల్లో లోక్‌సభ ఎన్నికలతో పాటు పలు రాష్ట్రాల ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఓ కీలకమైన విషయంపై జోరుగా చర్చ జరుగుతోంది. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు కనీస వయసు తగ్గింపుపై ప్రతిపాదనలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.

New Update
మరో సంచలనం దిశగా కేంద్రం.. 18 ఏళ్లకే ఎన్నికల్లో పోటీకి అవకాశం!

మరికొద్ది నెలల్లోనే లోక్‌సభ ఎన్నికలతో పాటు పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో దేశమంతా ఎన్నికల మూడ్‌లోకి వెళ్లింది. ఇప్పటికే ఏ పార్టీలు అధికారంలోకి వస్తాయనే సర్వేలు హల్ చల్ చేస్తున్నాయి. ఈ తరుణంలో ఎన్నికలకు సంబంధించి ఓ కీలకమైన విషయంపై చర్చ జరుగుతోంది. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే అభ్యర్థుల కనీస వయస్సు తగ్గింపుపై కేంద్ర న్యాయశాఖకు చెందిన పార్లమెంటరీ స్థాయి సంఘం అధ్యయనం చేసి నివేదికను కూడా రూపొందిచింది. ప్రస్తుతం ఒక వ్యక్తి లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడానికి కనీస వయస్సు 25 సంవత్సరాలు ఉంది. రాజ్యసభ లేదా రాష్ట్ర శాసన మండలిలో పోటీ చేయాలంటే మాత్రం కనీస వయస్సు 30 ఏళ్లు ఉండాలి.

సీఈసీ అభ్యంతరాలు..

ఇప్పుడు ఆ వయసు 18ఏళ్లకు తగ్గించాలనే ప్రతిపాదనలను కేంద్ర ప్రభుత్వం కూడా అంగీకరించిందని తెలుస్తోంది. ఇదే నిజమైతే 18 సంవత్సరాలు ఉన్న ప్రతి ఒక్కరు ఎన్నికల్లో పోటీ చేయవచ్చు. ప్రస్తుతం 18 సంవత్సరాలు ఉన్న ప్రతి ఒక్కరికి ఓటు వేసే అధికారం ఉంది. ప్రతి ఎన్నికల్లో యువత కీలక పాత్ర పోషిస్తోందని అందుకే బాధ్యతయుతమైన రాజకీయ భాగస్వాములు కూడా కావాలని పార్లమెంటరీ సంఘం సిఫార్సు చేసింది. మరోవైపు ఎన్నికల సంఘం మాత్రం ఈ ప్రతిపాదనను వ్యతిరేకించింది. 18 సంవత్సరాల వయస్సు ఉన్నవారు.. పార్లమెంటు, రాష్ట్ర శాసన సభలలో సభ్యులుగా ఉండేందుకు కావాల్సిన అనుభవం, పరిపక్వత ఎలా కలిగి ఉంటారని ప్రశ్నిస్తోంది. ఈ నివేదిక అవాస్తవికంగా ఉందని పేర్కొంది.

నివేదికలో పలు విషయాలు..

అయితే పార్లమెంటరీ స్టాండిగ్ కమిటీ తన నివేదికలో పలు విషయాలు ప్రస్తావించింది. కెనడా, యూకే, ఆస్ట్రేలియా వంటి వివిధ దేశాల పద్ధతులను పరిశీలించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపింది. యువతలో పెరుగుతున్న రాజకీయ స్పృహ.. ఎన్నికల ప్రక్రియలో బాధ్యతాయుతమైన రాజకీయ భాగస్వాములు కాగలరని పేర్కొంది. ఇలాంటి అనేక అంశాలు పరిశీలించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కమిటీ వెల్లడించింది. ఈ నిర్ణయంతో దేశ రాజకీయాల్లో యువత ప్రాతినిధ్యం పెరుగుతుందని చెప్పింది. కానీ ఎన్నికల సంఘం అభ్యంతరాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయంపై ఎలాంటి ముందడుగు వేస్తుందనేది ఆసక్తిగా మారింది.

మోదీ ప్రధానిగా అయిన దగ్గరి నుంచి ఎన్నికల ప్రక్రియపై తనదైన శైలిలో స్పందిస్తూనే ఉన్నారు. రాజకీయాల్లో యువత భాగస్వామ్యం కావాలని తరుచూ చెబుతూ ఉంటారు. మరోవైపు దేశమంతా ఒకేసారి జమిలి ఎన్నికలు నిర్వహించాలని భావిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల వయసు కూడా తగ్గించే దిశగా అడుగులు వేస్తున్నారు.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు