Hyderabad: పార్థీ గ్యాంగ్ మరోసారి రెచ్చిపోయింది. గత కొంతకాలంగా భారీ చోరీలకు పాల్పడుతున్న దొంగల ముఠా తాజాగా నాగోల్ జయపురికాలనీ గోల్డెన్ లీవ్స్ విల్లాస్‌లో అర్ధరాత్రి భారీ చోరీకి తెగబడింది. తాళం వేసిన రెండు విల్లాల్లో పెద్ద ఎత్తున నగదు, బంగారు నగలు ఎత్తుకెళ్లింది. ఈ మేరకు విల్లా నెంబర్ 22, 89లో ఈ చోరీ జరిగినట్లు పోలీసులు తెలిపారు. బాధితుల సమాచారంతో క్లూస్ టీంతోపాటు రంగంలోకి దిగిన స్పెషల్ టీం దీనిపై దర్యాప్తు చేపట్టింది.
అయితే ఈ దొంగతనానికి పాల్పడింది స్థానికులా లేక.. పార్థీ గ్యాంగ్ పనేనా అనే కోణంలో పోలీసు అధికారులు పరిశీలిస్తున్నారు. అయితే స్థానికులు మాత్రం పార్థీ గ్యాంగ్ పైనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రెండ్రోజుల క్రితమే హైదరాబాద్ - విజయవాడ జాతీయ రహదారిపై చోరీలకు పాల్పడుతున్న పార్థీ ముఠాను శుక్రవారం నల్గొండ సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు. పారిపోతున్న దొంగలపై కాల్పులు జరిపి మరీ పట్టుకున్నారు.
ఇది కూడా చదవండి: SI Suicide : ఎస్సై ప్రాణం తీసిన కుల వివక్ష.. పురుగుల మందు తాగి శ్రీనివాస్ మృతి!
ఈ క్రమంలోనే మరోసారి చోరీ జరగడం నగరంలో కలకలం రేపుతోంది. వీరంతా నల్గొండ, సైబరాబాద్, రాచకొండ, సంగారెడ్డి జిల్లాలో జాతీయ రహదారిలపై ఆగిన వాహనాలను లక్ష్యంగా చేసుకుని చోరీలకు, హత్యలకు పాల్పడ్డట్టు నల్గొండ ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు. నిందితుల నుంచి రూ.17 వేలు, స్క్రూ డ్రైవర్, రెండు కత్తెరలు, వెండి పట్టీలు, ఒక టార్చ్ లైట్ స్వాధీనం చేసుకున్నారు. పార్థీ గ్యాంగ్ పై రాష్ట్రవ్యాప్తంగా 32 కేసులు ఉన్నట్లు వెల్లడించారు.