2024 టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌ టోర్నీకి అర్హ‌త సాధించిన ప‌సికూన‌ జట్టు

వచ్చే ఏడాది జరగనున్న మెన్స్ టీ20 వరల్డ్ కప్ టోర్నీకి పసికూన జట్టు పపువా న్యూ గినియా అర్హత సాధించింది. శుక్ర‌వారం పిలిప్పీన్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో 100 ప‌రుగుల భారీ తేడాతో గెలుపొందింది. దీంతో ప్రపంచకప్‌లో పాల్గొనే 20జట్లలో ఒకటిగా నిలిచింది.

New Update
2024 టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌ టోర్నీకి అర్హ‌త సాధించిన ప‌సికూన‌ జట్టు

భారీ తేడాతో విజయం..

2024లో జరగనున్న పురుషుల టీ20 ప్ర‌పంచ‌క‌ప్(Mens T20 World Cup)టోర్నీకి పపువా న్యూ గినియా అర్హత సాధించింది. వ‌చ్చే ఏడాది వెస్టిండీస్‌-అమెరికా సంయుక్తంగా నిర్వ‌హించ‌నున్న టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌కు తూర్పు ఆసియా-పసిఫిక్ క్వాలిఫైయర్ విభాగం నుంచి స్థానం ద‌క్కించుకుంది. శుక్ర‌వారం పిలిప్పీన్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో 100 ప‌రుగుల భారీ తేడాతో విజయం సాధించడంతో ప్రపంచకప్‌లో పాల్గొనే 20జట్లలో ఒకటిగా నిలిచింది. ఎమిని పార్క్ వేదిక‌గా పపువా న్యూ గినియా, పిలిప్పీన్స్ జ‌ట్ల మ‌ధ్య మ్యాచ్ జ‌రిగింది. తొలుత బ్యాటింగ్ చేసిన పపువా జట్టులో టోనీ యురా (61), ఆసద్‌ వాలా (59), అమిని(53) లు రాణించ‌డంతో నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో ఆరు వికెట్లు కోల్పోయి 229 ప‌రుగులు చేసింది. అనంత‌రం టార్గెట్ ఛేదించేందుకు బ‌రిలో దిగిన పిలిప్పీన్స్ ఏడు వికెట్ల న‌ష్టానికి 129 ప‌రుగులే చేసింది. ఆ టీమ్ కెప్టెన్‌ డేనియల్‌ స్మిత్‌ 34 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు.

తొలిసారిగా 20 జట్లు పోటీ..

వెస్టిండీస్‌, అమెరికా ఆతిథ్యం ఇస్తున్న 2024 టీ20 ప్ర‌పంచ క‌ప్‌లో తొలిసారిగా 20 జ‌ట్లు పోటీప‌డ‌నున్నాయి. మొదటి రౌండ్‌లో మొత్తం 20 జ‌ట్లను నాలుగు గ్రూపులుగా విభ‌జించ‌నున్నారు. ఒక్కో గ్రూపులో ఐదు జ‌ట్లు ఉంటాయి. ప్రతి గ్రూప్ నుంచి తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు సూపర్ 8 రౌండ్‌కు అర్హత సాధిస్తాయి. ఇక్క‌డ 8 జ‌ట్ల‌ను రెండు గ్రూపులుగా విభ‌జిస్తారు. ప్ర‌తి గ్రూపులో నాలుగు జ‌ట్లు ఉంటాయి. ఇక గ్రూపులో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జ‌ట్లు సెమీ ఫైన‌ల్‌కు చేరుకుంటాయి.

ఇప్పటికే ఐర్లాంట్, స్కాట్లాండ్‌లు అర్హత..

అతిథ్య హోదాలో అమెరికా, వెస్టిండీస్‌లు అర్హత సాధించాయి. ర్యాంకింగ్స్ ఆధారంగా ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, ఇండియా, న్యూజిలాండ్, పాకిస్తాన్, దక్షిణాఫ్రికా, శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్‌, నెదర్లాండ్స్ జట్లు స్థానం దక్కించుకున్నాయి. మిగిలిన ఎనిమిది స్థానాల కోసం క్వాలిఫ‌య‌ర్ టోర్నీలు జరుగుతున్నాయి. అమెరికా క్వాలిఫ‌య‌ర్ టోర్నీ ద్వారా ఓ స్థానం, ఆసియా, ఆఫ్రికా క్వాలిఫ‌య‌ర్‌ల ద్వారా రెండేసి చొప్పున నాలుగు బెర్తులు ఖ‌రారు కానున్నాయి. ఇప్ప‌టికే క్వాలిఫ‌య‌ర్ ద్వారా ఐర్లాండ్‌, స్కాట్లాండ్‌లు అర్హత సాధించగా తాజాగా పపువా న్యూ గినియా ప్లేస్ దక్కించుకుంది. మ‌రో ఐదు బెర్తులు కోసం మ్యాచ్‌లు జరగనున్నాయి.

Advertisment
Advertisment
తాజా కథనాలు