Palvai Sravanthi: మునుగోడు రాజకీయంలో కీలక మలుపు చోటు చేసుకుంది. కాంగ్రెస్ పార్టీకి(Congress Party) రాజీనామా చేసిన పాల్వాయి స్రవంతి.. బీఆర్ఎస్(BRS)లో చేరేందుకు సిద్ధమయ్యారు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా అనంతరం.. హైదరాబాద్ ప్రెస్‌క్లబ్‌లో మీడియాతో మాట్లాడారు పాల్వాయి స్రవంతి. ఈ సందర్భంగా కోమటిరెడ్డి బ్రదర్స్‌పై సంచలన కామెంట్స్ చేశారు. కాంగ్రెస్ తన సిద్ధాంతాలను గంగలో కలిపేసిందని విమర్శించారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేరికే ఇందుకు నిదర్శనం అన్నారు. అసలు పార్టీనే లేదని.. చచ్చిపోయింది అంటూ కాంగ్రెస్ జెండాను నేలకేసి కొట్టిన రాజగోపాల్ రెడ్డిని తిరిగి పార్టీలో చేర్చుకోవడాన్ని ఆమె తీవ్రంగా తప్పుపట్టారు.
మీడియాతో పాల్వాయి స్రవంతి చేసిన కామెంట్స్ యధావిధంగా..
'కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశాను. రాజీనామా లేఖను పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, సోనియా గాంధీకి పంపించాను. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని బ్రతికించాలనే ఆలోచన ఎవరిలోనూ లేదు. ఎవరి స్వార్థం వారిది.. ఎవరి స్వలాభం వారిది అన్నట్లుగా పరిస్థితి తయారైంది. పార్టీ జెండాను మోసిన వారికి కాకుండా డబ్బు సంచులు మోసే, ఆర్టీ ఫిరాయింపుదారులకు పాల్పడే వారికి మాత్రమే టికెట్లు ఇస్తున్నారు. రాత్రి పార్టీలో జాయిన్ అయిన వారికి ఉదయానే పార్టీ టికెట్ ఇస్తున్నారంటే పార్టీ పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. కాంగ్రెస్ పార్టీ చనిపోయిందన్న వ్యక్తి ఇవాళ ఏ మొహం పెట్టుకుని అదే పార్టీ కార్యకర్తల వద్దకు వెళ్తారు? రాజగోపాల్ రెడ్డి నామినేషన్‌కు వెళ్లొదని నిర్ణయించుకున్నాను. అందుకే వెళ్లలేదు. నామినేషన్ సందర్భంగా రాజగోపాల్ రెడ్డి మాట్లాడిన మాటలు వింటే ఆశ్చర్యమేసింది. కాంగ్రెస్ పార్టీ, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఎవరూ లేరు.. కేవలం కోమటిరెడ్డి బ్రదర్స్ బ్రాండ్ మాత్రమే ఉందట. ఈ మాటలు చూస్తుంటే ఏమనాలో కూడా అర్థం కావడం లేదు.' అని అన్నారు.
'టికెట్ ఇవ్వకపోతే ఇవ్వకపోయారు.. కనీసం చెప్పాలి కదా. ఇన్ని రోజులైనా పార్టీ నన్ను కనీసం సంప్రదించలేదు. పరిస్థితి చూస్తుంటే.. కార్యకర్తలను కాంగ్రెస్ కాపాడుతుందన్న, ప్రజలను కాపాడుతుందనే నమ్మకం పోయింది. పార్టీలో జరుగుతున్న పరిస్థితులు చూస్తుంటే.. కాంగ్రెస్‌పై ఉన్న కనీస గౌరవం పోకముందే.. పార్టీని వీడటం మంచిదని నిర్ణయించుకున్నాను. బాధాతప్త హృదయంతోనే పార్టీని వీడాలని నిర్ణయించుకున్నాను. కాంగ్రెస్ పార్టీనే మా కుటుంబం, కాంగ్రెస్ పార్టీనే మా ధ్యేయం. కాంగ్రెస్ జెండానే మా ఊపిరి అనుకుని అహర్నిషలు ఎన్ని త్యాగాలు చేసినా.. ఏం చేసినా ఇదే మాపార్టీ అనుకున్నాం. కానీ, మధ్యలో బ్రోకర్లు వచ్చి.. కాంగ్రెస్ పార్టీని పాతాళానికి తొక్కేస్తారని, విలువలు లేని పార్టీగా మార్చేస్తారని అస్సలు అనుకోలేదు. నిన్న మొన్నటి వరకు గాంధీ భవన్ వద్ద ధర్నా చేశాం. ఏమైనా న్యాయం చేశారా? మా నాన్న నీతి, నాజాయితీతో బతికి సమాజంలో గౌరవం సంపాదించుకున్నందుకా? మా నన్న అవినీతికి పాల్పడలేదనా? ఊర్లు దోచుకోలేదనా?, ఆస్తులు కూడగట్టలేదనా? డబ్బులు లేవు అని మాట్లాడుతున్నారు? మనుగోడులో రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ జెండాను వదిలేస్తే.. మేము నిలబెట్టాం. మా నాన్న పాల్వాయి గోవర్ధన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కోసం ఎంతో శ్రమించారు. ఎన్ని కష్టాలొచ్చినా ఆయన పార్టీ కోసం పని చేశారు. ఆయన స్ఫూర్తితోనే నేను కూడా కాంగ్రెస్ కోసం పని చేశాను. కానీ, ఇప్పుడు జరుగుతున్న అవమానాలు, పార్టీలో నెలకొన్న పరిస్థితులు చూస్తుంటే.. కాంగ్రెస్ పార్టీ తన సిద్ధాంతాలను తుంగలో తొక్కినట్లు కనిపిస్తోంది. ఇక ఇందులో కొనసాగలేను. అందుకే పార్టీకి రాజీనామా చేశాను.' అని అన్నారు పాల్వాయి స్రవంతి.
బీఆర్ఎస్‌లో స్రవంతి..
కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన పాల్వాయి స్రవంతి.. తదుపరి తన ప్రయాణం బీఆర్ఎస్‌లోనే అని పరోక్షంగా క్లారిటీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీకి తాను రాజీనామా చేయడాన్ని కార్యకర్తలు అంగీకరిస్తారని భావిస్తున్నట్లు తెలిపారు. అయితే, కుల, మత రాజకీయాలు చేసే పార్టీలో చేరే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు స్రవంతి. అంటే ఆమె బీజేపీలోకి పోరనే విషయాన్ని పరోక్షంగా తేల్చేశారు. కార్యకర్తల అభిప్రాయం మేరకే ఏ పార్టీలో చేరాలనేది నిర్ణయం తీసుకుంటానని చెప్తూనే.. మంత్రి జగదీశ్ రెడ్డి తనను ఆహ్వానించిన విషయాన్ని వెల్లడించారు. దాదాపుగా బీఆర్ఎస్ వైపే ఆమె పయనం సాగేలా కనిపిస్తోంది. తన అనుచరులు సైతం బీఆర్ఎస్ పేరునే సూచిస్తున్నారని, బీఆర్ఎస్ కూడా ప్రజల సమస్యల పరిష్కారం కోసం పని చేస్తుందంటూ ఆ పార్టీకి అనుకూలంగా వ్యాఖ్యలు చేశారు. దీని ప్రకారం.. ఆమె గులాబీ తీర్థం పుచ్చుకోవడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది.
Also Read:
ఏ నియోజకవర్గంలో ఎవరు పోటీ చేస్తున్నారు? పార్టీల వారీగా వివరాలు..
ప్రధాన పార్టీలకు రెబల్స్ గండం.. బుజ్జగింపులు షురూ చేసిన అగ్రనేతలు..