/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/mutti-reddy-jpg.webp)
ఎమ్మెల్సీ పల్లా వర్సెస్ జనగాం ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి మధ్య గత కొంత కాలంగా సాగిన మాటల యుద్ధానికి తెరపడింది. ఇన్నాళ్లూ ఒకరిపై మరొకరు పై చేయి సాధించేందుకు నానా తంటాలు పడ్డారు. ప్రగతి భవన్ మెట్లు ఎక్కారు. ఇద్దరు నేతల అనుచరులు బల ప్రదర్శన చేసేంత వరకు వెళ్లారు. ఒకానొక దశలో ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి జనగామలో అర్ధనగ్న ప్రదర్శన కూడా చేశారు. అయితే వీరిద్ధరి గొడవకు చెక్ పెట్టేందుకు ఇటీవల కేటీఆర్ రంగంలోకి దిగారు. బుజ్జగింపుల్లో భాగంగా ఎమ్మెల్యే ముత్తిరెడ్డికి ఆర్టీసీ చైర్మన్ పదవిని కట్టబెట్టారు. ఇటీవల ఆయన చైర్మన్‌గా ప్రమాణస్వీకారం కూడా చేశారు కూడా. ఈ నేపథ్యంలోనే బుధవారం నాడు మంత్రి హరీశ్ రావు సమక్షంలో జనగామలో జరిగిన సభలో పల్లా రాజేశ్వర్ రెడ్డిని జనగామ ప్రజలు ఆదరించాలని ముత్తిరెడ్డి తన ప్రసంగంలో కోరారు. ఆ వెంటనే మైకు వద్దకు వచ్చిన పల్లా రాజేశ్వర్‌రెడ్డి ముత్తిరెడ్డి కాళ్లు మొక్కి కృతజ్ఞతలు తెలియజేశారు. దీన్ని చూసిన వారంతా ఔరా అంటూ అవాక్కయ్యారు. పల్లా తన కాళ్లు మొక్కడంతో ముత్తిరెడ్డి మనసు కరిగిపోయినట్లు కార్యకర్తలు గుసగుసలాడుకుంటున్నారు. ఆయన ఇక పల్లాకు వ్యతిరేకంగా ఒక్క చిన్న పని కూడా చేయరని చర్చించుకుంటున్నారు.