పాక్ క్రికెటర్ల జీతాలు పెంపు.. అయినా కానీ భారత ప్లేయర్ల కంటే తక్కువే

పాకిస్థాన్ క్రికెటర్ల జీతాలు పెరిగాయి. ఆసియా కప్, వన్డే ప్రపంచకప్ సమీపిస్తున్న నేపథ్యంలో పాక్ ఆటగాళ్లకు ఆ దేశ క్రికెట్ బోర్డు శుభవార్త అందించింది. సెంట్రల్ కాంట్రాక్టులో ఉన్న ఆటగాళ్లకు ఇచ్చే జీతాలను భారీగా పెంచింది.

New Update
పాక్ క్రికెటర్ల జీతాలు పెంపు.. అయినా కానీ భారత ప్లేయర్ల కంటే తక్కువే

నెలకు రూ.13.22లక్షలు..

త్వరలో ఆసియా కప్, వన్డే ప్రపంచకప్ సమీపిస్తున్న నేపథ్యంలో పాక్ ఆటగాళ్లకు మరింత సపోర్ట్ ఇచ్చేలా పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) కీలక నిర్ణయం తీసుకుంది. సెంట్రల్ కాంట్రాక్టులో ఉన్న ఆటగాళ్లకు ఇచ్చే జీతాలను భారీగా పెంచుతూ నిర్ణయం తీసుకుంది. గతంతో పోలిస్తే దాదాపు 4 రెట్లు జీతం పెంచినట్లు ప్రముఖ క్రికెట్ వెబ్‌సైట్స్ వెల్లడించాయి. ప్రస్తుతం పాకిస్థాన్ సెంట్రల్ కాంట్రాక్ట్‌లో ఏ కేటగిరీలో ఉన్న కెప్టెన్ బాబర్ ఆజమ్, మహమ్మద్ రిజ్వాన్, షాహీన్ షా అఫ్రిదీలకు నెలకు దాదాపు రూ.13.22 లక్షలు ఇవ్వనుంది. గతంలో నెలకు రూ.3.88 లక్షలు మాత్రమే ఉండేది. గతంలో ఉన్న సెంట్రల్ కాంట్రాక్టు ప్రకారం రెడ్ బాల్ ఆటగాళ్లు నెలకు రూ.3.2లక్షలు పొందేవారు. వైట్ బాల్ ఆటగాళ్లు 2.8లక్షలు అందేవి.

ఏడాదికి కోటిన్నర రూపాయలు..

వాస్తవంగా పాకిస్థాన్ క్రికెటర్ల కాంట్రాక్టు గత జూన్‌లోనే ముగిసింది. అప్పటి నుంచి ఇప్పటివరకు ఎలాంటి కాంట్రాక్టు లేకుండానే ఆటగాళ్లు ఆడుతున్నారు. తాజాగా పెంచిన జీతభత్యాల ప్రకారం ఏ-గ్రేడ్ కాంట్రాక్టు ఉన్న ఆటగాళ్లకు సంవత్సరానికి దాదాపు కోటిన్నర రూపాయల వరకు అందనుంది. తాజా కాంట్రాక్టు ప్రకారం ఆటగాళ్లను నాలుగు కేటగిరీలుగా విభజించారు. ఏ-కేటగిరీలో ఉన్న వారికి నెలకు సుమారు రూ.13 లక్షలు దక్కనుండగా, బీ కేటగిరీలో ఉన్న ఆటగాళ్లకు రూ.8.7 లక్షలు అందనుంది. సీ,డీ గ్రూపు ప్లేయర్లు నెలకు రూ.2.19 లక్షల నుంచి రూ.4.38లక్షల వరకు అందుకోనున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఆటగాళ్లకు జీతాలు తక్కువగా ఇచ్చే బోర్డుల్లో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఒకటిగా ఉంది. కానీ తాజా పెంపుతో గతం కన్నా పెద్ద మొత్తంలో డబ్బు ముట్టనుంది.

భారత ప్లేయర్ల కంటే తక్కువే..

వచ్చే ఏడాది నుంచి ఐసీసీ నుంచి పీసీబీకి వచ్చే ఆదాయం కూడా పెరగనుంది. సుమారు 38 మిలియన్ డాలర్లు తీసుకోనుంది. దీంతో ఆటగాళ్ల జీతం కూడా పెంచుతూ బోర్డు చైర్మన్ జకా అష్రాఫ్ నిర్ణయం తీసుకున్నారు. పీసీబీ జీతాలు పెంచినా భారత ఆటగాళ్లతో పోలిస్తే చాలా తక్కువ మొత్తంలోనే వారి చేతికి అందనుంది. బీసీసీఐ ఆటగాళ్లను మొత్తం 4 గ్రేడ్లుగా విభజించింది. ఏ ప్లస్ గ్రేడ్‌లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, జస్‌ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజాలు ఉండగా.. వారు ఏడాదికి రూ.7కోట్ల చొప్పున ఆర్జిస్తారు. ఇక ఏ గ్రేడ్‌లో ఉన్న క్రికెటర్లు రూ.5 కోట్లు.. బీ గ్రేడ్‌ ఆటగాళ్లు రూ.3 కోట్లు.. సీ గ్రేడ్‌ ప్లేయర్లు రూ.కోటి చొప్పున అందుకుంటారు. ఆటగాళ్లకు అత్యధికంగా జీతాలు ఇచ్చే బోర్డుల్లో అన్ని క్రికెట్ బోర్టుల కంటే బీసీసీఐ తొలి స్థానంలో ఉంది.

Advertisment
Advertisment
తాజా కథనాలు