Atlantic Ocean: సముద్రంలో పడవ బోల్తా పడడంతో సుమారు 63 మంది మృతి చెందారు. సెనెగల్ నుంచి ప్రయాణమైన ఓ పడవ కేప్ వెర్డే (Cape Verde) వద్ద బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 63 మంది శరణార్థులు మరణించినట్లు అంతర్జాతీయ వలసల సంస్థ (IOM) బుధవారం రాత్రి వెల్లడించింది.
ఈ పడవలో సుమారు 100 మంది సెనెగల్, సియెర్రా లియోన్ నుంచి వచ్చిన వారు ఉన్నారని ఐఓఎం పేర్కొంది. 37 మంది మాత్రమే ఈ ప్రమాదం నుంచి బయటపడినట్లు వారు వివరించారు. వారిలో 12 నుంచి 16 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న నలుగురు పిల్లలు కూడా క్షేమంగా బయటపడినట్లు ఐఓఎం ప్రతినిధి తెలిపారు.
కేప్ వెర్డియన్ ద్వీపం సాల్ నుంచి సుమారు 277 కిలో మీటర్ల దూరంలో పశ్చిమ ఆఫ్రికాలోని అట్లాంటిక్ మహా సముద్రం మధ్యలో పొడవైన చెక్క భాగాలు కనిపించాయని అధికారులు తెలిపారు. ఆ ప్రదేశంలో ఓ ఓడ మునిగినట్లుగా అధికారులు ధృవీకరించారు. అయితే ఇది ఎలా మునిగింది అనే విషయం తెలియాల్సి ఉంది.
కేప్ వెర్డియన్ అధికారులు క్షతగాత్రులను తరలించి సహాయక చర్యలు చేపట్టారు. మునిగిపోయిన పడవ స్పానిష్ ఫిషింగ్ బోట్ గా గుర్తించారు. అయితే ఈ ప్రమాదం జరిగి ఎన్ని రోజులు అయ్యింది అనే దాని మీద మాత్రం స్పష్టత లేదు. జులై 10 న పడవ సెనెగల్ నుంచి బయల్దేరినట్లు అధికారులు తెలిపారు.
అయితే ప్రమాద స్థలంలో ప్రస్తుతానికి ఏడుగురి మృతదేహాలను మాత్రం అధికారులు గుర్తించారు. మరో 56 మంది జాడ తెలియకుండా పోయింది. ఏటా చాలా మంది పేదరికం నుంచి తప్పించుకోవడానికి కొన్ని వేల మంది శరణార్థులు, వలసదారులు ప్రమాదకరమైన ప్రయాణం చేస్తున్నారని ఐఓఎమ్ అధికారులు వెల్లడించారు.