విపక్షాల ఐక్యతారాగం.. మంత్రి కేటీఆర్ సెటైర్ 2024లో బీజేపీ సర్కార్ ను కూల్చడమే లక్ష్యంగా విపక్షాలు కలిశాయి. పాట్నాలో కీలక సమావేశం ఏర్పాటు చేశాయి. దాదాపు 15 పతిపక్ష పార్టీలు ఇందులో పాల్గొన్నాయి. కానీ, తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రాంతీయ పార్టీలు వెళ్లకపోవడం హాట్ టాపిక్ గా మారింది. సరిగ్గా ఇదే టైమ్ లో పార్టీలు కలవడం కాదు.. ప్రజలు ఏకం కావాలి అంటూ మంత్రి కేటీఆర్ చేసిన సెటైరికల్ కామెంట్స్ సరికొత్త చర్చకు దారితీశాయి. By Trinath 23 Jun 2023 in నేషనల్ Scrolling New Update షేర్ చేయండి మోడీ మేనియాతో 2014లో బీజేపీ విజయబావుటా ఎగురవేసింది. పలు పార్టీలను కలుపుకుని యూపీఏ కూటమికి భారీ షాకిచ్చింది. 282 స్థానాలను కైవసం చేసుకుంది. 2019లోనూ ఇదే సీన్ రిపీట్ అయింది. అదనంగా ఇంకో 21 సీట్లు గెలిచి మొత్తం 303 సీట్లు సాధించి తిరుగులేని శక్తిగా అవతరించింది. కాంగ్రెస్ లో అంతర్గత కుమ్ములాటలు, విపక్షాల మధ్య సడలిన సఖ్యత కారణంగా బీజేపీకి ఎదురే లేకుండా పోయింది. కానీ, 2024 అలా ఉండదని అంటున్నాయి ప్రతిపక్ష పార్టీలు. బీజేపీకి బుద్ధి చెప్పి తీరుతామని ముక్తకంఠంతో చెబుతున్నాయి. 2024 లోక్ సభ ఎన్నికల కోసం బీజేపీ వ్యతిరేక ఫ్రంట్ ఏర్పాటుకు రోడ్ మ్యాప్ ను రూపొందించేందుకు ప్రతిపక్ష పార్టీలు కలిశాయి. బిహార్ రాజధాని పాట్నా ప్రతిపక్ష నేతల సమావేశానికి వేదికైంది. జేడీ(యూ)కి చెందిన బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్, ఆర్జేడీకి చెందిన డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ ఈ భేటీకి ఆతిథ్యం ఇచ్చారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, అగ్ర నేత రాహుల్ గాంధీ, రాష్ట్రీయ జనతాదళ్ అధినేత లాలూ ప్రసాద్ సహా 15 ప్రతిపక్ష పార్టీలకు చెందిన 30 మందికి పైగా నాయకులు హాజరయ్యారు. బీజేపీని ఎదుర్కోవడమే లక్ష్యంగా ఈ మీటింగ్ ఏర్పాటు చేశారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై నేతలు చర్చలు జరిపారు. కలిసికట్టుగా బీజేపీని ఓడిస్తామని రాహుల్ గాంధీ ధీమా వ్యక్తం చేశారు. ప్రజల్లో ద్వేషం, హింసను ప్రేరేపించి దేశాన్ని విభజించాలని బీజేపీ చూస్తున్నట్లు విమర్శించారు. ప్రేమను, ఐక్యతను తమ పార్టీ చాటుతోందని ప్రతిపక్ష పార్టీలు అన్నీ కలిసి వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీని ఓడిస్తాయని అన్నారు. అయితే.. ఈ మీటింగ్ కు తెలుగు రాష్ట్రాల్లోని పార్టీలు దూరంగా ఉన్నాయి. బీఆర్ఎస్, వైసీపీ, టీడీపీ వెళ్లలేదు. అలాగే, ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్, జేడీఎస్ కుమారస్వామి, బీఎస్పీ అధినేత్రి మాయవతి, ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ సైతం హ్యాండిచ్చారు. మరోవైపు విపక్షాల మీటింగ్ పై మంత్రి కేటీఆర్ స్పందించారు. కాంగ్రెస్, బీజేపీయేతర కూటమే తమ లక్ష్యమని అన్నారు. రాజకీయ పార్టీలు ఒక్కటి కావడం ముఖ్యం కాదని, దేశంలో ఉన్న పరిస్థితుల దృష్ట్యా.. ప్రజలంతా ఏకం కావడం ముఖ్యమని చెప్పారు. దేశంలో ప్రస్తుతం ఉన్న సమస్యలకు కాంగ్రెస్, బీజేపీ పార్టీలే కారణమని విమర్శించారు. ఆ రెండు పార్టీల వల్లే దేశంలో సమస్యలు ఉత్పన్నమైనట్లు చెప్పారు. ఒకవేళ విపక్ష పార్టీలన్నీ రాజకీయంగా బీజేపీ వైపో లేక కాంగ్రెస్ వైపో మళ్లితే అప్పుడు దేశానికి ఎటువంటి ప్రయోజనం ఉండదని చెప్పుకొచ్చారు. విపక్షాల ఐక్యతారాగం అందుకున్న ఈ టైమ్ లో కేటీఆర్ వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. #NULL మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి