పార్లమెంట్‌లో వాయిదాల పర్వం కొనసాగుతోంది. విపక్షాల ఆందోళనల నేపథ్యంలో వరుసగా నాలుగవ రోజు కూడా ఉభయ సభలు స్థంభించి పోయాయి. లోక్ సభ ప్రారంభం అయిన వెంటనే విపక్ష సభ్యులు ఆందోళనకు దిగారు. మణిపూర్ అంశంపై ప్రధాని మోడీ వివరణ ఇవ్వాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. ‘మోడీ సర్కార్ జవాబ్ దో’ అంటూ నినాదాలు చేశాయి.
సభలో ప్రశ్నోత్తరాల సమయం ప్రారంభం కాగానే విపక్ష సభ్యులు నిరసనకు దిగారు. దీంతో సభ సజావుగా జరిగేందుకు సహకరించాలని విపక్ష సభ్యులను స్పీకర్ ఓం బిర్లా కోరారు. ప్రశ్నోత్తరాల సమయం అనేది ప్రభుత్వ బాధ్యతను సూచిస్తుందని తెలిపారు. అందుకే ప్రశ్నోత్తరాల సమయానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
ప్లకార్డులు, నిరసనలు అనేవి ఏ సమస్యను కూడా పరిష్కరించలేవని స్పీకర్ అన్నారు. సభలో ఆందోళనలు పార్లమెంటరీ సాంప్రదాయానికి వ్యతిరేకమని చెప్పారు. కానీ ప్రతిపక్ష సభ్యులు ఆయన పట్టించుకోలేదు. సభలో ఆందోళనలను కొనసాగించారు. గందర గోళ పరిస్థితుల మధ్య సభను ఈ రోజు మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేశారు.
ఈ నెల 20 నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం అయ్యాయి. సమావేశాలు ప్రారంభమైన రోజు నుంచి సభలో ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో ఈ రోజు లోక్ సభలో అఖిల పక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు. సభలో నెలకొన్న పరిస్థితులపై అన్ని పార్టీ సభ్యులతో స్పీకర్ చర్చిస్తున్నారు.