హైదరాబాద్‌లోని పాతబస్తీ వరకు మెట్రోను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో అందుకు సంబంధించిన పనులు వేగంగా జరుగుతున్నాయి. మెట్రో పనుల్లో భాగంగా పాతబస్తీలో మరోసారిడ్రోన్ సర్వే నిర్వహించబోతున్నట్లు మెట్రో అధికారులు తెలిపారు. ఇంతకు ముందు కూడా సర్వే చేశామన్న అధికారులు.. మెట్రో అలైన్‌మెంట్, ప్రభావిత ఆస్తులపై ఈ సర్వే చేసినట్లు మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. తమ సర్వేల్లో కొన్ని ఇరుకైన ప్రాంతాలు ఉన్నట్లు గుర్తించామన్నారు. ఇందులో 103 మతపరమైన, నిర్మాణాలు, సున్నిత నిర్మాణాలు ఉన్నాయన్నారు.
కాగా ప్రస్తుతం చేయబోయ్యే డ్రోన్ సర్వే మెట్రో నిర్మాణాలకు ఏవిధంగా ఉంటుంది, మెట్రో నిర్మాణానికి ఇబ్బందిగా ఉన్న ప్రాంతాలు ఏవి.? ఆ సవాళ్లను ఎలా అధిగమించాలి అనే ఆలోచనతో వెళ్లబోతున్నామని తెలిపారు. అంతే కాకుండా మెట్రో రైల్ పిల్లర్, దానికి సంబంధించి అడ్రస్‌కు ఎలాంటి ప్రతికూల ప్రభావం చూపకుండా నిర్మాణాలు చేపట్టాల్సి ఉంటుందన్నారు. డ్రోన్ సర్వే ద్వారా రియల్ టైమ్ డేటా, త్రీడి మోడలింగ్, జీఐఎస్ డేటా, డేటా విశ్లేషణ, విజువలైజేషన్‌ను తర్వగా సేకరించవచ్చన్నారు. రానున్న రోజుల్లో ఈ పక్రియను ప్రారంభిస్తామన్నారు.
కాగా ఇటీవల కొనసాగిన తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో పాతబస్తీ వరకు మెట్రోను నిర్మిస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. హైదరాబాద్ వ్యాప్తంగా మెట్రో అందుబాటులో ఉండాలనేది తమ లక్ష్యమన్నారు. పాతబస్తీతోపాటు, హయత్ నగర్ వరకు మెట్రోను విస్తరిస్తామని సీఎం వెల్లడించారు. దీంతో పాటు నాగోల్, ఎల్బీ నగర్ మెట్రోను కలుపుతామని వివరించారు. అనంతరం ఉప్పల్ నుంచి బోడుప్పల్ వరకు కూడా మెట్రో నిర్మాణం చేపడుతామని సీఎం పేర్కొన్నారు.