Paris Olympics 2024: పారిస్ ఒలింపిక్స్‌లో పురుషుల టెన్నిస్ సింగిల్స్ ఫైనల్లో సెర్బియా టెన్నిస్ దిగ్గజం నోవాక్ జొకోవిచ్ స్పెయిన్‌కు చెందిన కార్లోస్ అల్కరాజ్‌ను ఓడించి తొలి ఒలింపిక్ బంగారు పతకాన్ని గెలుచుకున్నాడు. నిజానికి, జకోవిచ్ గత వింబుల్డన్ ఫైనల్‌లో కార్లోస్ అల్కరాజ్ చేతిలో ఓడిపోయాడు. ఇప్పుడు జొకోవిచ్ ఒలింపిక్స్‌లో అల్కరాజ్‌ను ఓడించడం ద్వారా తన పాత ఓటమికి ప్రతీకారం తీర్చుకున్నాడు. ఆదివారం జరిగిన ఉత్కంఠ పోరులో జొకోవిచ్ 7-6(3), 7-6(2)తో అల్కరాజ్‌ను ఓడించాడు. దీంతో, జొకోవిచ్ తన కెరీర్‌లో తొలి ఒలింపిక్ స్వర్ణ పతకాన్ని సాధించగా, అల్కరాజ్ తొలి ఒలింపిక్ స్వర్ణ పతకాన్ని అందుకునే అవకాశాన్ని కోల్పోయాడు.
మొదటి గోల్డ్..
Paris Olympics 2024: టెన్నిస్ ప్రపంచంలో 24 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ నెగ్గిన జొకోవిచ్ ఒలింపిక్ పతకం కోసం ఏడాది పాటు ఎదురుచూడాల్సి వచ్చింది. అయితే, జకోవిచ్ గత మూడు ఒలింపిక్స్‌లో సెమీఫైనల్ రౌండ్‌తో తన ప్రయాణాన్ని ముగించాడు. జకోవిచ్ 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో ఆండీ ముర్రే చేతిలో, 2012 లండన్ ఒలింపిక్స్‌లో అలెగ్జాండర్ జ్వెరెవ్ చేతిలో ఓడిపోయాడు. చివరిసారి, 2020లో టోక్యో ఒలింపిక్స్ సెమీ-ఫైనల్స్‌లో రాఫెల్ నాదల్ జకోవిచ్‌ను ఓడించాడు. అయితే, 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో జకోవిచ్ కాంస్య పతకాన్ని సాధించగలిగాడు.
ఈ ఒలింపిక్స్ లో తన పోటీదారులందరినీ సమర్థంగా ఎదుర్కొన్న జొకోవిచ్.. సెమీఫైనల్ మ్యాచ్‌లో ఇటలీ ఆటగాడు లొరెంజో ముసెట్టీని ఓడించి తొలిసారి ఒలింపిక్ ఫైనల్‌లోకి ప్రవేశించాడు.
చివర్లో గెలిచాడు
Paris Olympics 2024: ఇక ఫైనల్ మ్యాచ్ గురించి చెప్పాలంటే.. ముందుగా ఊహించినట్లుగానే ఇద్దరి మధ్య ఒక్కో పాయింట్ కోసం గట్టిపోటీ నెలకొంది. దీంతో తొలి సెట్ 94 నిమిషాల పాటు అంటే గంటన్నర పాటు కొనసాగింది. రెండో సెట్‌లో కూడా గట్టి పోటీ నెలకొనడంతో ఈ సెట్ కూడా గంటసేపు సాగింది. చివరికి రెండు సెట్లు టై బ్రేకర్‌లో ఫలితాన్ని అందించాయి. చివరికి రెండున్నర గంటలపాటు సాగిన మ్యాచ్‌లో జకోవిచ్ విజయం సాధించాడు. జకోవిచ్ గెలిచిన వెంటనే కోర్టులో చిన్న పిల్లాడిలా పెద్దగా ఏడవడం మొదలుపెట్టాడు.
ఈ ఘనత సాధించిన ఐదో ఆటగాడు
Paris Olympics 2024: ఇప్పుడు ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకాన్ని గెలుచుకోవడం ద్వారా, కెరీర్ గోల్డెన్ స్లామ్ సాధించిన ఐదో టెన్నిస్ ఆటగాడిగా జొకోవిచ్ నిలిచాడు. కెరీర్ గోల్డెన్ స్లామ్ అనే పదాన్ని సింగిల్స్ చరిత్రలో మొత్తం నాలుగు గ్రాండ్ స్లామ్ టైటిళ్లు -ఒలింపిక్ స్వర్ణం గెలిచిన ఆటగాడి గురించి చెప్పడానికి ఉపయోగించే గౌరవమైన పదం. జకోవిచ్ కంటే ముందు స్టెఫీ గ్రాఫ్, ఆండ్రీ అగస్సీ, రాఫెల్ నాదల్, సెరెనా విలియమ్స్ ఈ గోల్డెన్ స్లామ్ సాధించిన వారిలో ఉన్నారు.