రాత్రి నిద్రపోయే ముందు చూస్తే వర్షం దంచికొడుతోంది.. ఉదయం లేచి చూస్తే బాది పడేస్తోంది.. ఈ వర్షం తగ్గలేదా అని అనుకుంటేనే ఫోన్‌కి ఏమైనా మెసేజులు వచ్చాయేమోనని చూశారు తల్లిదండ్రులు. వర్షం కారణంగా స్కూల్ లేదన్న మెసేజ్ కనిపిస్తుందని భావించారు. కానీ అలాంటి మెసేజులు ఏమీ కనపడకపోవడంతో పిల్లలను స్కూల్‌కి రెడీ చేశారు. స్కూల్ బస్సు కూడా వచ్చేసింది. నాన్‌స్టాప్‌గా కురుస్తున్న వర్షంలో గతుకుల రోడ్లలో.. వర్షపు నీరు నిలిచి కనపడకుండా ఉన్న గుంటల్లో ప్రయాణించిన బస్సు స్కూల్‌కి చేరుకుంది.. తీరా స్కూల్‌కి వెళ్లిన కాసేపటికి ఇవాళ, రేపు సెలవు అని సర్క్యూలర్ వచ్చింది. మళ్లీ అదే బస్సులో ఇంటికి వెళ్లిపోయారు పిల్లలు.. అటు స్కూల్ బస్ సదుపాయం లేని వాళ్లని తమ తల్లిదండ్రులే దింపగా..తిరిగి ఇంటికి వెళ్లే దారిలోనే స్కూల్‌కి సెలవు అని తెలిసింది. దీంతో మళ్లీ రిటర్న్ వచ్చి తమ పిల్లలను స్కూల్ నుంచి తీసుకెళ్లిపోయారు. ఇవాళ ఉదయం తెలంగాణలోని చాలా చోట్ల కనిపించిన దృశ్యాలు ఇవి.
ఇంత లేట్‌గా చెబితే ఎలా?
తెలంగాణలో వర్షం ఉన్నట్టుండి ఊడిపడలేదు. 48గంటలుగా చాలా జిల్లాల్లో వరుణుడు ప్రతాపం చూపిస్తూనే ఉన్నాడు. లోతట్టు ప్రాంతాలు ఇప్పటికే నీటితో నిండిపోయాయి. పలు చోట్ల వర్షపు నీరు ఇళ్లలోకి కూడా వచ్చి చేరింది. మరో 5రోజులు తెలంగాణలో ఇలాంటి పరిస్థితులే ఉంటాయని నిన్ననే వాతావరణశాఖ హెచ్చరించింది. కొన్నిజిల్లాలకు రెడ్ అలెర్ట్ కూడా జారీ చేసింది. ఇదంతా ప్రభుత్వానికి తెలియనది కాదు..విద్యాశాఖకు కనిపించనది కాదు..మరి ముందుగానే సెలవులు డిక్లేర్ చేస్తే ఏమవుతుందని ప్రశ్నిస్తున్నారు తల్లిదండ్రులు. ఇవాళ ఉదయం 8 గంటల వరకు సెలవులపై అధికారక ప్రకటన రాకపోవడమేంటని ప్రశ్నిస్తున్నారు. నిన్న రాత్రే సెలవు గురించి చెబితే సరిపోయేది కదా అని అడుగుతున్నారు. అటు పలు పరీక్షలు కూడా వాయిదా పడ్డాయి. ఆ ప్రకటన కూడా ఇవాళే వచ్చింది. చాలా మంది అభ్యర్థులు వర్షంలోనే క్యాబ్‌లు, ఆటోలు అధిక రేటుకు బుక్ చేసుకొని సెంటర్లకు చేరుకునే సమయంలో పరీక్ష వాయిదా నిర్ణయం తీసుకోవడంపై అసంతృప్తి వ్యక్తమవుతోంది. ముందుగానే చెబితే బాగుండేది కదా అని అభ్యర్థులను సైతం అసహనం వ్యక్తం చేస్తున్నారు.
గొడుగులతో..పిల్లలలో..అలా:
ఎడతెరిపి లేని వర్షంతో స్కూల్, కాలేజీ ఉంటుందా అని తెలియని అయోమయంలో రెడీ అయిన విద్యార్థులు ఉదయం చాలా చోట్లా గొడుగులతో కనిపించారు. కాలేజీ విద్యార్థులు క్యాబ్, ఆటోల కోసం వెయిట్ చేస్తూ కనిపించగా.. స్కూల్ పిల్లలు తమ తల్లిదండ్రులతో గొడుగు రక్షణలో బస్సు కోసం ఎదురుచూస్తు కనిపించారు. తీరా 8గంటల తర్వాత విద్యాశాఖ కాలేజీలకు, స్కూల్‌కు ఇవాళ, రేపు సెలవులు ప్రకటించింది. ఎల్లుండి(శనివారం) మళ్లీ విద్యాసంస్థలు రీఓపెన్ అవుతాయని చెప్పింది. మరోవైపు, తెలంగాణలో పలు జిల్లాలను భారీ వర్షం ముంచెత్తింది. ఉమ్మడి ఆదిలాబాద్, మెదక్ జిల్లాలలో ప్రస్తుతం భారీ వర్షం కురుస్తోంది. అటవీ ప్రాంతాల్లోని వాగుల్లో నీటిమట్టం ప్రమాదకర స్థాయికి చేరుకుంది. కుమురంభీం జిల్లా బెజ్జూర్‌లో 14 సెం.మీ వర్షం పాతం నమోదైంది. మెదక్ జిల్లా వెల్దుర్తిలో 15 సెం.మీ, దామరంచలో 13 సెం.మీ, రాజపల్లిలో 12 సెం.మీ వర్షపాతం రికార్డయింది.