Nirmala Sitharaman : 2022-23లో దేశ జీడీపీ వృద్ధి 7.2 శాతంగా ఉందని.. అది 2023-24లో 6.5 శాతం వృద్ధి చెందుతుందని అంచనా వేస్తున్నామన్నారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. అవిశ్వాస తీర్మానంపై చర్చలో భాగంగా లోక్‌సభలో నిర్మలా ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ అంచనాలను అనేక గ్లోబల్ ఏజెన్సీలు చెప్పామని.. మన సొంత RBI ప్రొజెక్షన్ కూడా ఇదే విధంగా ఉందన్నారు నిర్మలా సీతారామన్. ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ ఇండియాదేనన్నారు నిర్మల.
ఆమె మాట్లాడుతూ, "2013లో, మోర్గాన్ స్టాన్లీ దేశాన్ని ప్రపంచంలోని ఐదు బలహీన ఆర్థిక వ్యవస్థల జాబితాలో చేర్చింది. మన కంట్రీని బలహీనమైన ఆర్థిక వ్యవస్థగా ప్రకటించింది.
ఇవాళ అదే మోర్గాన్ స్టాన్లీ మన దేశాన్ని అప్‌గ్రేడ్ చేసి, అధిక రేటింగ్ ఇచ్చింది. కేవలం 9 సంవత్సరాలలో, మన ప్రభుత్వ విధానాల వల్ల ఆర్థిక వ్యవస్థ పుంజుకుంది, ఆర్థికాభివృద్ధిని సాధించింది. అది కూడా కోవిడ్ ఉన్నప్పటికీ గ్రోత్ కనిపించింది. ఈ రోజు మనం ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ." అంటూ కామెంట్స్ చేశారు నిర్మల.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) 2023-24 ఆర్థిక సంవత్సరంలో మొదటి త్రైమాసికంలో అత్యంత లాభదాయకమైన కంపెనీగా అవతరించిందన్నారు. రూ.18,000 కోట్లకు పైగా ఆర్జించిందన్నారు నిర్మలా. ఇక విపక్షాల కూటమి ఇండియాపై కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ విమర్శలు గుప్పించారు. ఐక్యంగా పోరాడడంలో విపక్ష పార్టీలు వైఫల్యం అయ్యాయని..తమలో తాము పోరాటం చేసుకుంటున్నారని ఆమె సెటైర్లు వేశారు. బ్యాంకింగ్ రంగం మెరుగైన స్థితిలో ఉండాలని తమ ప్రభుత్వం గుర్తించిందన్నారు. రాజకీయ జోక్యం లేకుండా బ్యాంకులు పని చేస్తున్నాయన్నారు.
యూపీఏ దశాబ్దం మొత్తం వృధా చేసిందని ఫైర్ అయ్యారు నిర్మలా. అవిశ్వాస తీర్మానంపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటన సందర్భంగా కాంగ్రెస్, ఎన్సీపీ, డీఎంకే ఎంపీలు లోక్‌సభ నుంచి వాకౌట్ చేశారు. తమిళనాడులో డీఎంకే అధికారంలో ఉన్నప్పుడు తమిళనాడు అసెంబ్లీలో ప్రతిపక్ష నేత జయలలిత చీర లాగించారని కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. తాను ముఖ్యమంత్రి అయ్యే వరకు సభకు వెళ్లనని జయలలిత సభ నుంచి వెళ్లిపోయారు. ఎవరి హయాంలో సభలో ప్రతిపక్ష నాయకుడి చీర లాగేశారో నేడు ద్రౌపది గురించి చెబుతున్నారు అంటూ విమర్శించారు. లోక్‌సభలో నిర్మలా సీతారామన్.. 2014, 2019లో ప్రజలు యూపీఏపై అవిశ్వాసం పెట్టి ఓడించారు. 2024లోనూ అదే పరిస్థితి ఉంటుందన్నారు నిర్మలా.