Nimmala Ramanaidu: రాష్ట్రంలో సహకార సంఘాలు, రూరల్ బ్యాంకులను జగన్ గత ఐదేళ్లలో నిర్వీర్యం చేశాడని ఆరోపించారు మంత్రి నిమ్మల రామానాయుడు. పాలకొల్లు మార్కెట్ యార్డులో సహకార సంఘాలు, రూరల్ బ్యాంకు ఉద్యోగుల యూనియన్ మహాజన సభ సమావేశానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సహకార సంఘాలు, రూరల్ బ్యాంకులు అంటే తనకు చాలా గౌరవమని, తాను కోపరేటివ్ సహకార సంఘం అధ్యక్షుడిగా పనిచేశానన్నారు.
రైతులకు సహకారం చేసేది సహకార సంఘాలని, మంచి సహకారాలు అందిస్తే రైతులు చిరునవ్వుతో పంటలు పండించి అందిస్తారన్నారు. అటువంటి సహకార సంఘాలలో పనిచేసే ఉద్యోగులు.. మంచి పే స్కేల్స్, ఉద్యోగ భద్రత కల్పిస్తేనే రైతులకు మంచి సేవలు అందుతాయన్నారు. ఉద్యోగులకు DCCB, APCOBల నుండి జీతాలు చెల్లించాలని గత టీడీపీ ప్రభుత్వంలో ఆదేశాలు జారీ చేశామన్నారు. దురదృష్టవశాత్తు జగన్ ఐదేళ్ల పాలనలో ఆదేశాలను తుంగలో తొక్కారన్నారు.