Dharani: ఎత్తేద్దామా, మారుద్దామా!.. ఎన్‌ఐసీకి ధరణి బాధ్యతలు? పోర్టల్ నిర్వహణ బాధ్యతను కేంద్రం అధీనంలో ఉండే ఎన్ఐసీకి అప్పగించాలని భావిస్తున్నట్లు సమాచారం. మొదట రాష్ట్ర ప్రభుత్వ అధీనంలోని సీజీజీకి బాధ్యతలు అప్పగించేందుకు చర్చలు జరిగినప్పటికీ, విశ్వసనీయతలో రాజీ పడొద్దన్న ఉద్దేశంతో ఈ ఆలోచనకు వచ్చినట్టు తెలుస్తోంది. By Naren Kumar 22 Jan 2024 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి NIC To Take Dharani: ధరణిని మొత్తంగా ఎత్తేయాలా.. లేదంటే పేరు మార్చి సైట్‌లో మార్పులు చేస్తే సరిపోతుందా అన్న విషయమై కూడా సర్కారు కసరత్తులు చేస్తోంది. ఇందులో భాగంగానే పోర్టల్ (Dharani Portal) నిర్వహణ బాధ్యతను కేంద్రం అధీనంలో ఉండే నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్ (NIC)కి అప్పగించాలని భావిస్తున్నట్లు సమాచారం. మొదట రాష్ట్ర ప్రభుత్వ అధీనంలోని సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ (CGG)కు నిర్వహణ బాధ్యతలను అప్పగించేందుకు చర్చలు జరిగినప్పటికీ, విశ్వసనీయతలో రాజీ పడొద్దన్న ఉద్దేశంతో ఈ ఆలోచనకు వచ్చినట్టు తెలుస్తోంది. ధరణిపై సమీక్షల్లో భాగంగా ఇప్పటికే పలు దఫాలుగా సమావేశమైన ధరణి కమిటీ సోమవారం మరోసారి సమావేశమై కీలక విషయాలు చర్చించింది. లక్షలాది మంది బాధితులు: కమిటీ సభ్యుడు కోదండరెడ్డి ధరణి పోర్టల్ లోపాల వల్ల బీఆర్ఎస్ ప్రభుత్వ (BRS Govt) హయాంలో అనేకమంది పేద రైతులకు రైతుబంధు (Rythu Bandhu) సాయం అందలేదని కిసాన్ సెల్ జాతీయ ఉపాధ్యక్షుడు, ధరణి కమిటీ సభ్యుడు కోదండరెడ్డి అన్నారు. సోమవారం సీసీఎల్ఏలో ధరణిపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ సమావేశమై పోర్టల్ లోపాలు, చేయాల్సిన సవరణలపై చర్చించింది. గతప్రభుత్వం చేసిన చట్టాల్లో లోపాలు లక్షలాది మంది రైతులను ఇబ్బందులకు గురిచేస్తోందని, వాటిని సవరించాల్సిన అవసరముందని అన్నారు కోదండరెడ్డి. కమిటీ ప్రజల వద్దకు వెళ్లి సమస్యలు తెలుసుకుంటుందని చెప్పారు. ధరణిపై హైకోర్టు లో చాలా కేసులు ఉన్నాయని న్యాయవాది సునీల్ చెప్పారు. ధరణితో సంబంధం ఉన్న అన్ని శాఖల అభిప్రాయం తీసుకుని; తాత్కాలిక, దీర్ఘకాలిక చర్యలను పరిశీలిస్తామని సీనియర్ అధికారి రేమండ్ పీటర్ అన్నారు. రెండు రోజుల్లో కొందరు కలెక్టర్లతో సమావేశం నిర్వహిస్తామని తెలిపారు. ఇది కూడా చదవండి: గెలిచే దాకా కొట్లాడుతా.. బ్లెస్ మీ సర్.. కోదండరాంతో బర్రెలక్క భేటీ ప్రాధాన్య క్రమంలో నివేదికలు ఒక్కో అంశంపైనా ప్రాధాన్య క్రమంలో కమిటీ నివేదికలు సమర్పించాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. అసైన్డ్, భూదాన్, వక్ఫ్, ఎండోమెంట్ భూములపై అనేక చిక్కుముళ్లు ఉన్న నేపథ్యంలో ఈ నిర్ణయానికి వచ్చింది. ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో ఏడు దఫాలుగా జరిగిన అసైన్డ్ భూ పంపిణీకి సంబంధించి కూడా అనేక సమస్యలు తలెత్తాయి. ఇటీవలి వరకూ కమిటీ ఈ సమస్యలతో పాటు పలు అంశాలపై చర్చించింది. లెక్కలేనన్ని సమస్యలు! చాలా కాలం క్రితం కొని, సాగు చేసుకుంటున్న భూములు పోర్టల్‌లో గతంలో విక్రయించిన వారి పేర్లతో చూపడం; పట్టాభూములను ప్రభుత్వ, అసైన్డ్ భూములుగా చూపించడం వంటి సమస్యలు తలెత్తాయి. కొన్ని భూములు నిషేధిత జాబితాలో కూడా చేరాయి. విస్తీర్ణంలో తేడాలు, పేర్లలో తప్పులు, సర్వే నంబర్లలో తప్పుల వంటివి బయటపడ్డాయి. చాలా మందికి పాస్ బుక్కుల (Pass Books) సమస్య కూడా ఉంది. వీటన్నిటిపైనా లెక్క లేనన్ని పత్రాలు, పెండింగ్ సమస్యలు కూడా బాధితులు విన్నవించే అవకాశం ఉండడంతో పోర్టల్ సమూల మార్పులపై ప్రజాభిప్రాయ సేకరణ కష్టంగా మారవచ్చు. ఈ నేపథ్యంలో కార్యాచరణపై చర్చిస్తున్నట్టు తెలుస్తోంది. వికేంద్రీకరణే మార్గం! భూ సమస్యల పరిష్కార మార్గాలను బీఆర్ఎస్ ప్రభుత్వం కేంద్రీకృతం చేసింది. తహశీల్దార్ పనిని కూడా సీసీఎల్ఏకి అప్పగించింది. ఈ నేపథ్యంలో భూమాత పోర్టల్ అమలు చేస్తే యంత్రాంగాన్ని వికేంద్రీకరించడం తప్పదని కమిటీ నిర్ణయానికి వచ్చింది. సమస్యల స్థాయిలను బట్టి కేటగిరీలుగా విభజించాలని నిర్ణయించారు. ఎన్‌ఐసీనే ఎందుకు? మాడ్యూళ్లను యాడ్ చేయడం, తొలగించడం వంటి పనులు ఎన్ఐసీతో సులభంగా జరుగుతాయని భావిస్తున్నారు. ఆ సంస్థ వద్ద ఆధార్ సమాచారం కూడా ఉండడం మరో అడ్వాంటేజ్. గోప్యత, నిష్పాక్షికతకు అవకాశం ఎక్కవ ఉంటుందని భావిస్తున్నారు. అయితే దీనిపై ఇంకా ఓ నిర్ణయానికి రాలేదు. ఇంకా ప్రతిపాదనల దశలోనే ఉంది. గత ప్రభుత్వం ధరణి నిర్వహణను టెర్రాసిస్ అనే ప్రైవేట్ సంస్థకు అప్పగించింది. తాజాగా, కాంగ్రెస్ ప్రభుత్వం ఆ వ్యవస్థ మొత్తం ప్రభుత్వం అధీనంలోనే ఉండాలని భావిస్తోంది. #dharani #nic #nic-to-take-dharani మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి