Tirupati: అంతర్రాష్ట్ర దొంగల ముఠాను తిరుపతి పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి సుమారు 50లక్షల విలువ చేసే ఐరన్ లోడు లారీతో పాటు ఎస్కాట్‌కు వినియోగించిన రూ10లక్షల విలువ చేసే కారును స్వాధీనం చేసుకున్నారు. తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేటలోని డీఎస్పీ కార్యాలయంలో మీడియా మాట్లాడుతూ.. గత నెల 27వ తేదీన కర్ణాటక రాష్ట్రం నుంచి ఐరన్ లోడ్ తో చెన్నై కు లారీ బయలుదేరిందన్నారు.
Also Read: వైసీపీ నాయకులకు డిప్యూటీ సీఎం స్వీట్ వార్నింగ్.. పిచ్చి..పిచ్చి మాటలు కాదు.. సహాయం చేయండి.!
మార్గ మధ్యలో నాయుడుపేటలోని శ్రీకాళహస్తి జాతీయ రహదారి వద్ద లారీ యజమానికి సంబంధించిన దుకాణం వద్ద డ్రైవర్ రవి లారీని ఆపి నిద్రించేందుకు ఇంటికి వెళ్ళాడు. ఉదయం వచ్చి చూసేసరికి లారీ లేకపోవడంతో చుట్టుపక్కల గాలించినా ఫలితం లేకపోవడంతో చోరీకి గురైనట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి చోరీపై దర్యాప్తు చేశామన్నారు.
కాకినాడకు చెందిన గంగాధర్, హైదరాబాదుకు చెందిన ఇక్బాల్, అబ్దుల్ రహీమ్ ఈ చోరీకి పాల్పడినట్లు గుర్తించి ఏర్పేడు - వెంకటగిరి మధ్యలో వారిని అరెస్టు చేసి వారి వద్ద నుంచి చోరీ గురైన సుమారు 60లక్షల విలువ చేసే లారీ, అందులో ఉన్న ఇనుప సామాగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పి సుబ్బరాయుడు వెల్లడించారు. అలాగే నిందితులు ఉపయోగించిన పది లక్షల విలువ చేసే కారును కూడా స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.