NEET Updates: నీట్ పరీక్ష పేపర్ లీక్ కేసు దర్యాప్తులో ఇప్పటివరకు దేశంలోని 4 రాష్ట్రాల నుంచి 25 మందిని అరెస్టు చేశారు. ఇందులో బీహార్ నుంచి 13, జార్ఖండ్ నుంచి 5, గుజరాత్ నుంచి 5, మహారాష్ట్ర నుంచి 2 మంది ఉన్నారు. మహారాష్ట్రలో జూన్ 23న, నాందేడ్ ATS పబ్లిక్ ఎగ్జామినేషన్ యాక్ట్ 2024 కింద ఇద్దరు ఉపాధ్యాయులు సంజయ్ తుకారాం జాదవ్, లాతూర్‌కు చెందిన జలీల్ ఖాన్ ఉమర్ ఖాన్ పఠాన్, నాందేడ్‌కు చెందిన ఈరన్న మష్నాజీ కొంగల్వావ్, ఢిల్లీకి చెందిన గంగాధర్‌లపై కేసు నమోదు చేసింది. ఆదివారం అర్థరాత్రి జాదవ్, పఠాన్‌లను పోలీసులు అరెస్టు చేయగా, మిగిలిన ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారు.
బీహార్, గుజరాత్‌లకు చేరుకున్న సీబీఐ బృందం
కేంద్ర ప్రభుత్వం ఈ కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించింది. సీబీఐ బృందాలు సోమవారం బీహార్, గుజరాత్‌లకు చేరుకున్నాయి. బీహార్ ఈఓయూ తన దర్యాప్తు నివేదికను సీబీఐకి సమర్పించింది. పాట్నాలో పేపర్ లీకేజీ సూత్రధారి సంజీవ్ ముఖియాను అరెస్ట్ చేసేందుకు ఆరు ఈఓడీ బృందాలు వేర్వేరు చోట్ల దాడులు నిర్వహిస్తున్నాయి.
నీట్ అంశంపై ప్రధాని మోదీకి మమతా బెనర్జీలేఖ..
ఇప్పుడు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. కేంద్రీకృత పరీక్షా విధానానికి స్వస్తి పలకాలని, మునుపటిలా వికేంద్రీకరణ చేయాలని ప్రధానికి చెప్పారు. అంటే రాష్ట్రం, కేంద్రం వేర్వేరుగా పరీక్షలు నిర్వహించాలని ఆమె ఆ లేఖలో కోరారు.
NSUI ధర్నా..
NSUI సభ్యులు NEET పరీక్షను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ప్రదర్శన చేశారు. పార్లమెంట్‌ను చుట్టుముట్టేందుకు ప్రయత్నించిన ఆందోళనకారులు పోలీసుల బారికేడ్‌ను కూడా బద్దలు కొట్టేందుకు ప్రయత్నించారు. పరీక్షలను రద్దు చేయాలని, విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. బారికేడ్ దూకిన ఆందోళనకారులను భద్రతా బలగాలు అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల జోక్యంతో వారు నిరసనను ముగించారు.
Also Read: గాలిపటంతో పాటు గాలిలోకి ఎగిరిపోయిన చిన్నారి.. తరువాత ఏమైందంటే..