వరుణుడిని కూడా వదలని కేంద్రం.. వర్షంపై GST!

ఆన్‌లైన్‌ ఫుడ్‌ ప్లాట్‌ఫామ్‌లు కొత్త GST రేట్లు అమలులోకి రావడానికి ముందుతో పోలిస్తే వినియోగదారులకు ఆర్థిక భారం పెరిగింది. 'రెయిన్ ఫీ' (వర్షం పడినప్పుడు విధించే ఫీజు) పై కూడా జీఎస్టీ విధించడాన్ని ఓ కస్టమర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా, అది వైరల్ అవుతోంది.

New Update
rain free

స్విగ్గీ, జొమాటో వంటి ఆన్‌లైన్‌ ఫుడ్‌ ప్లాట్‌ఫామ్‌లు డెలివరీ ఫీజు కింద 18 శాతం జీఎస్‌టీ వసూలు చేస్తుంటాయి. కొత్త జీఎస్‌టీ రేట్లు అమలులోకి రావడానికి ముందుతో పోలిస్తే వినియోగదారులకు ఆర్థిక భారం పెరిగింది. దీంతో వినియోగదారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా, 'రెయిన్ ఫీ' (వర్షం పడినప్పుడు విధించే ఫీజు) పై కూడా జీఎస్టీ విధించడాన్ని ఒక కస్టమర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా, అది వైరల్ అవుతోంది.

ఆశిష్ గుప్తా అనే కస్టమర్ స్విగ్గీ బిల్లు స్క్రీన్ షాట్‌ను Xలో షేర్ చేశారు. ఆ బిల్లులో రెస్టారెంట్ ప్యాకేజింగ్, ప్లాట్‌ఫామ్ ఫీ, రెయిన్ ఫీ, రెస్టారెంట్ జీఎస్టీతో పాటు "రెయిన్ ఫీ పై జీఎస్టీ" అని ప్రత్యేకంగా ఉంది. ఈ అంశంపై ఆయన వ్యంగ్యంగా స్పందిస్తూ, "చారిత్రక జీఎస్టీ సంస్కరణల తర్వాత, వర్షం కురిపించే వరుణ దేవుడు పన్ను పరిధిలోకి వచ్చారు. ఇకపై వర్షం పడినప్పుడు, రూ.25 రెయిన్ ఫీ + 18% జీఎస్టీ = రూ. 29.50 చెల్లించాలి. తర్వాత సూర్యుడి పన్ను , ఆక్సిజన్ నిర్వహణ రుసుము, శ్వాస తీసుకున్నందుకు జీఎస్టీ కూడా వసూలు చేస్తారేమో!" అని పోస్ట్ చేశారు.

ఈ పోస్ట్ తక్కువ సమయంలోనే వైరల్ అయింది. చాలామంది నెటిజన్లు ఆన్‌లైన్ డెలివరీ యాప్‌లు వసూలు చేస్తున్న విపరీతమైన ఛార్జీలపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కొందరు, "వర్షపు ఫీజుపై కూడా జీఎస్టీ వేయడం చూసి షాకయ్యా" అని కామెంట్ చేయగా, మరికొందరు, "రెయిన్ ఫీ ఒక సర్వీస్ ఫీజు, కాబట్టి దానికి జీఎస్టీ వర్తిస్తుంది" అని వివరించారు. ఈ ఫీజులు డెలివరీ భాగస్వాములకు వర్షంలో పనిచేసినందుకు అదనపు పారితోషికంగా ఉపయోగపడతాయని మరికొందరు అభిప్రాయపడ్డారు.

అయితే, ఈ డెలివరీ ఛార్జీలపై జీఎస్టీ నిబంధనలు ప్రభుత్వం నుండి స్పష్టంగా ఉన్నాయి. ఇటీవల, కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ మార్గదర్శకాల ప్రకారం, డెలివరీ ఛార్జీలపై 18% జీఎస్టీ విధించబడుతుంది. దీంతో ఫుడ్ డెలివరీ కంపెనీలు ఈ పన్ను భారాన్ని వినియోగదారులకు బదిలీ చేస్తున్నాయి. ఈ కొత్త నిబంధనల వల్ల వినియోగదారులు ఒక్కో ఆర్డర్‌కు అదనంగా రూ. 2 నుండి రూ. 3 వరకు చెల్లించాల్సి వస్తోంది. ప్లాట్‌ఫామ్ ఫీజులు, డెలివరీ ఛార్జీలు, రెయిన్ ఫీజులు వంటి అదనపు రుసుములు, వాటిపై జీఎస్టీతో ఫుడ్ ఆర్డర్ ఖర్చు గణనీయంగా పెరిగిపోయింది. ఈ మొత్తం వ్యవహారంపై స్విగ్గీ ఇంకా అధికారికంగా స్పందించలేదు.

Advertisment
తాజా కథనాలు