Lucknow: ఇటీవలే EY పూణే సంస్థలో పని ఒత్తిడి కారణంగా 26 ఏళ్ళ యువతి మరణించిన ఘటన మరవకముందే.. లక్నోలోని మరో మహిళ పని ఒత్తిడితో మృతి చెందడం అందరి మనసుల్ని కలచివేస్తుంది. కార్యాలయంలో పనిచేస్తున్న ఆమె అకాస్మాత్తుగా కుర్చీ పై నుంచి కిందిపడి మరణించింది. సహా ఉద్యోగులు చెప్పిన వివరాల ప్రకారం ఆమె పని ఒత్తిడికి గురైనట్లు తెలుస్తోంది. మృతి చెందిన మహిళను లక్నోలోని హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్‌లో పనిచేస్తున్న మహిళ సదాఫ్ ఫాతిమాగా గుర్తించారు.
పని ఒత్తిడితో మరో ఉద్యోగి మృతి
సదాఫ్ ఫాతిమా గోమతీనగర్‌లోని హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ విబూతి ఖండ్ బ్రాంచ్‌లో అడిషనల్ డిప్యూటీ వైస్ ప్రెసిడెంట్‌గా విధులు నిర్వహిస్తోంది. అయితే ఫాతిమా సెప్టెంబర్ 24న ఆఫీస్ లో పని చేస్తూ అకస్మాత్తుగా కుర్చీలో నుంచి కిందపడిపోయింది. ఆ తర్వాత వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. అనంతరం ఫాతిమా మృత దేహాన్ని పోస్టుమార్టంకు పంపినట్లు సమాచారం. సహా ఉద్యోగులు చెప్పిన వివరాల ప్రకారం ఆమె పని ఒత్తిడికి గురైనట్లు తెలుస్తోంది.
ఈ ఘటన పై సమాజ్ వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ ఆందోళన వ్యక్తం చేస్తూ.. X లో సుదీర్ఘ పోస్ట్ ను షేర్ చేశారు. "దేశంలోని ప్రస్తుత ఆర్ధిక ఒత్తిడికి ఇది చిహ్నం అని అన్నారు. ఈ విషయంలో అన్ని కంపెనీలు, ప్రభుత్వ విభాగాలు సీరియస్ గా ఆలోచించాలి. ఇది దేశ మానవ వనరులకు పూడ్చలేని నష్టం. దేశ ప్రగతి నిజమైన కొలమానం సేవలు, ఉత్పత్తుల గణాంకాలు కాదు.. వ్యక్తి మానసికంగా ఎంత స్వేచ్ఛగా, ఆరోగ్యంగా, సంతోషంగా ఉన్నాడు అనేది అంటూ అఖిలేష్ యాదవ్ తెలిపారు. "