/rtv/media/media_files/2025/11/18/hidma-1-2025-11-18-12-45-30.jpg)
అల్లూరి జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మావోయిస్ట్ అగ్రనేత మాద్వి హిడ్మా హతం కావడంతో, దశాబ్దాలుగా భద్రతా బలగాలకు సింహస్వప్నంగా మారిన మోస్ట్ వాంటెడ్ హిడ్మా అసాధారణమైన పోరాట వ్యూహాలు మరోసారి చర్చనీయాంశమయ్యాయి. కేవలం 40 ఏళ్ల లోపే మావోయిస్ట్ కేంద్ర కమిటీలో కీలక స్థానాన్ని సంపాదించిన హిడ్మా, తన వ్యూహాత్మక దాడులు, క్రూరత్వంతోనే అత్యంత మోస్ట్ వాంటెడ్ జాబితాలో చేరాడు.
ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ సరిహద్దు ప్రాంతం హిడ్మాకు ప్రధాన కంచుకోట. ఈ ప్రాంతంలో అతనికి బలమైన గిరిజన నెట్‌వర్క్ ఉంది. ఒక రాష్ట్రంలో దాడి చేసి, వెంటనే మరో రాష్ట్ర అడవుల్లోకి అదృశ్యమవ్వడం అతని ప్రధాన వ్యూహం. భద్రతా బలగాలు కూంబింగ్ నిర్వహిస్తున్నప్పుడు, వారిని ఇరుకు మార్గాల్లోకి రప్పించి, ఎల్-ఆకృతిలో మాటు వేసేవాడు. ఈ వ్యూహంలో బలగాలను చుట్టుముట్టి, తప్పించుకునే అవకాశం ఇవ్వకుండా మారణహోమం సృష్టించేవాడు.
అతని కింద 150 మంది కమాండర్స్
హిడ్మా చిన్నతనంలో మావోయిస్ట్ బాలల సంఘం నుంచి పార్టీలో చేరడం వల్ల, గిరిజన యువతను ఆకర్షించి, వారిని శిక్షణ ఇచ్చి, పీఎల్‌జీఏ (PLGA) బెటాలియన్‌లో బలమైన క్యాడర్‌ను నిర్మించగలిగాడు. దాదాపు 150 మంది కమాండర్స్ అతని కింద పని చేసేవారు. భద్రతా బలగాల కంటే ముందే వారికి సంబంధించిన ఇంటెలిజెన్స్ సమాచారాన్ని సేకరించి, దాడులకు ముందు వ్యూహాలను మార్చుకునేవాడు. అందుకే, అతను ఎప్పుడూ మూడు అంచెల రక్షణ కవచంలో, 5 కి.మీ పరిధిలో పటిష్టమైన భద్రతతో ఉండేవాడు.అతనిపై రూ.కోటి రివార్డు,27 కేసులు నమోదయ్యాయి.
2010 దంతేవాడ దాడి: ఈ దాడిలో 76 మంది సీఆర్‌పీఎఫ్ (CRPF) సిబ్బంది మరణించారు.
2013 జిరామ్ ఘాటీ దాడి: ఈ మెరుపుదాడిలో అగ్ర కాంగ్రెస్ నాయకులతో సహా మొత్తం 27 మంది మరణించారు.
2021 సుక్మా-బీజాపూర్ దాడి: ఈ దాడిలో 22 మంది భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు.
హిడ్మా ఎత్తు5.6 అడుగులు.విద్యార్హత పదో తరగతి వరకు చదువుకున్నాడు. హిందీ, కోయ, తెలుగు, తమిళ, కన్నడ, మళయాళీ భాషల్లో నిష్ణాతుడు
ఇంతటి భద్రత, బలమైన నెట్‌వర్క్ ఉన్న హిడ్మాను భద్రతా బలగాలు ఈ ఎన్‌కౌంటర్‌లో హతమార్చడం మావోయిస్ట్ ఉద్యమానికి పెను నష్టం అని చెప్పాలి.
Follow Us