స్టీల్ ప్లాంట్‌లో అగ్ని ప్రమాదం.. ఏడుగురు సజీవ దహనం

ఛత్తీస్‌గఢ్‌ బలోడా బజార్ జిల్లాలో గురువారం పెను విషాదం చోటుచేసుకుంది. ప్రైవేట్ స్టీల్ ప్లాంట్‌లో బొగ్గు కొలిమి ఒక్కసారిగా పేలిపోవడంతో ఏడుగురు కార్మికులు మంటల్లో చిక్కుకుని సజీవ దహనమయ్యారు. ఈ ప్రమాదంలో మరో పది మందికి పైగా కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు.

New Update
Seven worker

ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం బలోడా బజార్ జిల్లాలో గురువారం ఉదయం పెను విషాదం చోటుచేసుకుంది. ప్రైవేట్ స్టీల్ ప్లాంట్‌లో బొగ్గు కొలిమి ఒక్కసారిగా పేలిపోవడంతో ఏడుగురు కార్మికులు మంటల్లో చిక్కుకుని సజీవ దహనమయ్యారు. ఈ ప్రమాదంలో మరో పది మందికి పైగా కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. బలోడా బజార్ జిల్లాలోని బకులాహి ప్రాంతంలో రియల్ ఇస్పాట్ స్టీల్ ప్లాంట్ ఉంది. గురువారం ఉదయం కార్మికులు తమ విధుల్లో భాగంగా ప్లాంట్‌లోని బొగ్గు కొలిమి ప్రాంతం చుట్టూ శుభ్రపరిచే పనులు చేస్తున్నారు. ఆ సమయంలో ఊహించని విధంగా కొలిమి ఒక్కసారిగా భారీ శబ్దంతో పేలిపోయింది. మండుతున్న బొగ్గు, వెలువడిన విపరీతమైన వేడిమి కార్మికులపై పడటంతో, అక్కడ పనిచేస్తున్న ఏడుగురు కార్మికులు తప్పించుకునే అవకాశం లేక అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. 

పేలుడు ధాటికి ప్లాంట్ మొత్తం దట్టమైన పొగలు, మంటలు అలుముకున్నాయి. ఈ మంటలు కిలోమీటరు దూరం వరకు కనిపిండంతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ప్రమాద సమాచారం అందిన వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన పది మందికి పైగా కార్మికులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ దుర్ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. స్టీల్ ప్లాంట్‌లో కనీస భద్రతా నిబంధనలు పాటించారా లేదా అనే కోణంలో అధికారులు పరిశీలిస్తున్నారు. కొలిమి పేలడానికి గల సాంకేతిక కారణాలను నిపుణుల ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. యాజమాన్యం నిర్లక్ష్యం ఉన్నట్లు తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా యంత్రాంగం వెల్లడించింది. మృతుల కుటుంబాల్లో ఈ ఘటన తీరని శోకాన్ని నింపింది.

Advertisment
తాజా కథనాలు