/rtv/media/media_files/2026/02/05/rac-2026-02-05-18-12-47.jpg)
రైల్వే ప్రయాణికుల నుంచి ఆర్‌ఏసీ టికెట్ల పేరుతో పూర్తి ఛార్జీలు వసూలు చేయడం ఏమాత్రం సమంజసం కాదని పార్లమెంటరీ కమిటీ తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. పూర్తి బెర్త్ సౌకర్యం లేనప్పుడు ప్రయాణికుల నుంచి ఫుల్ టికెట్ రేటు వసూలు చేయడం అన్యాయమని, అటువంటి వారికి టికెట్ మొత్తంలో కొంత భాగం తిరిగి రీఫండ్ చేయాలని కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖకు సిఫార్సు చేసింది.
సాధారణంగా ఆర్‌ఏసీ టికెట్ ఉన్న ఇద్దరు ప్రయాణికులు ఒకే సైడ్ లోయర్ బెర్త్‌ను పంచుకోవాల్సి ఉంటుంది. అంటే ఒకరు పడుకోవాల్సిన చోట ఇద్దరు కూర్చుని ప్రయాణించాల్సి వస్తోంది. కానీ రైల్వే శాఖ మాత్రం వీరిద్దరి నుంచి పూర్తి బెర్త్ ఖరీదును వసూలు చేస్తోంది. దీనిపై బుధవారం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన నివేదికలో పబ్లిక్ అకౌంట్స్ కమిటీ అభ్యంతరం వ్యక్తం చేసింది. మొత్తం డబ్బులు చెల్లించినా పూర్తి బెర్త్ దక్కని ప్రయాణికులకు కొంత మొత్తాన్ని వెనక్కి ఇచ్చేలా కొత్త విధానాన్ని తీసుకురావాలని కమిటీ సూచించింది.
రైళ్ల వేగం విషయంలోనూ
కేవలం ఆర్‌ఏసీ టికెట్లే కాదు, రైళ్ల వేగం విషయంలోనూ కమిటీ రైల్వే శాఖను తప్పుబట్టింది. గంటకు కనీసం 55 కిలోమీటర్ల వేగంతో వెళ్లే రైళ్లను సూపర్‌ఫాస్ట్ కేటగిరీ కింద పరిగణించడం ఏమాత్రం సరికాదని, ఇది పాతకాలపు పద్ధతి అని కమిటీ పేర్కొంది. కేవలం సూపర్‌ఫాస్ట్ సర్ఛార్జీలు వసూలు చేయడం కోసమే రైళ్లకు ఆ పేరు తగిలిస్తున్నారని, నిజానికి వందకు పైగా సూపర్‌ఫాస్ట్ రైళ్లు 55 కి.మీ వేగం కంటే తక్కువగానే నడుస్తున్నాయని కమిటీ వెల్లడించింది.
ప్రపంచ దేశాలతో పోటీ పడాలంటే భారతీయ రైల్వే తన ప్రమాణాలను మార్చుకోవాలని ప్యానెల్ సూచించింది. 2030 నాటికి సూపర్‌ఫాస్ట్ రైళ్ల సగటు వేగాన్ని గంటకు 100 కిలోమీటర్లకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకోవాలని చెప్పింది. అలాగే, కొత్త రైళ్లు ప్రవేశపెట్టడం వల్ల పాత రైళ్లు లేట్ కాకూడదని, ఉన్న రైళ్లను సరైన సమయానికి నడపడంపైనే రైల్వే దృష్టి పెట్టాలని కమిటీ స్పష్టం చేసింది.
Follow Us