Prashant Kishor: దేశం రాజకీయాల్లో మరో పార్టీ జీవం పోసుకుంది. ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ప్రత్యేక్ష రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నట్లు గతంలో ప్రకటన చేయగా.. ఈరోజు ఆయన తన పార్టీ పేరును ప్రకటించారు. బీహార్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో తన పార్టీ పేరును అధికారికంగా ప్రకటించారు. ఈరోజు నుంచి 'జన్ సూరాజ్ పార్టీ' అనేది తమ పార్టీ అని అన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తాను ప్రత్యేక్ష రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నట్లు ప్రకటించిన నాటి నుంచి తనను చాలా మంది అనేక సార్లు.. పార్టీ ఎప్పుడు మొదలు పెడుతున్నారని అడిగారని.. దానికి సమాధానం ఈరోజు ఇస్తున్నానని అన్నారు. ప్రజల సంక్షేమమే ముఖ్యంగా తాను పార్టీ ఏర్పాటు చేసినట్లు చెప్పారు.
బీహార్ ఎన్నికల్లో పోటీ...
2025లో జరగబోయే బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 243 స్థానాల్లో జన్ సరాజ్ పార్టీ పోటీ చేస్తోందని అన్నారు ప్రశాంత్ కిషోర్. ఇందులో కనీసం 40 మంది మహిళా అభ్యర్థులే ఉంటారని పేర్కొన్నారు. ఇక 2030లో కనీసం 70 నుంచి 80 మంది మహిళా అభ్యర్థులను ఎన్నికల బరిలోకి దింపుతామని స్పష్టం చేశారు. మహిళలు ఆర్థికంగా స్వతంత్రులు అయ్యేవరకు సమానత్వాన్ని పొందలేరని వ్యాఖ్యానించారు.
అలాగే మహిళలు తమ జీవనోపాధి కోసం 4 శాతం రుణం పొందాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. దీనిపై ప్రభుత్వం కూడా గ్యారెంటీ ఇవ్వాలన్నారు. తమ ప్రభుత్వం వచ్చాక బీహార్ ప్రజలు.. తక్కువ జీతం కోసం ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లాల్సిన అవసరం ఉండదన్నారు. ఈసారి ఎన్నికల్లో ప్రజలు నాయకులు కొడుకులు, కూతుర్లను చూసి కాకుండా.. మీ కొడుకులు, కూతుర్లను చూసి ఓటు వేయాలని కోరుతున్నానని ప్రశాంత్ కిషోర్ అన్నారు.