Karnataka: నా భార్య 8 మందిని వివాహం చేసుకుని మోసం చేసిందని ఓ భర్త కోర్టును ఆశ్రయించగా…కాదు ఆమె పెళ్లి చేసుకుంది నలుగుర్నే అంటూ ఆమె తరుఫున లాయర్ అనడంతో న్యాయమూర్తి షాక్ అయ్యారు. కర్ణాటక రాజధాని బెంగళూరులో ఈ షాకింగ్ ఘటన జరిగింది. కర్ణాటకలోని హోస్పేట్ కు చెందిన రాజా హుస్సైన్ అనే వ్యక్తి తన భార్య ఎనిమిది మందిని వివాహం చేసుకుందని హైకోర్టులో పిటిషన్ వేశాడు.
తన కంటే ముందు పలువురితో ఆమెకు పెళ్లి అయ్యిందని అతను వాదించాడు. అంతేకాదు, గృహహింస కేసు పెట్టిందని, దానిని కొట్టివేయాలని కూడా అతడు అభ్యర్ధించాడు. ఈ పిటిషన్‌పై విచారణ సందర్భంగా భార్య తరఫున లాయర్ వాదనలు వినిపిస్తూ… భర్త ఆరోపిస్తున్నట్టు ఆమె ఎనిమిది పెళ్లిళ్లు చేసుకోలేదని తెలిపారు. ఆమె కేవలం నలుగుర్నే పెళ్లి చేసుకుందని మొదటి భర్త చనిపోవడంతో రెండో పెళ్లి చేసుకుందని లాయర్ చెప్పారు.
అంతేకాకుండా ఇంతకు ముందు విచారణలో కోర్టుకు ఐదుగురు వ్యక్తులై హాజరై తమని ఆమె మోసం చేసిందని, గతంలో మమ్మల్ని పెళ్లి చేసుకుందని న్యాయమూర్తికి తెలియజేశారు. కానీ అప్పటి పరిస్థితుల వల్ల ఈ కేసు విచారణను కోర్టు వాయిదా వేసింది. తాజా విచారణలో వారితో పాటు మరో ముగ్గురు హైకోర్టులో అఫిడ్‌విట్ దాఖలు చేయడంతో జస్టిస్ ఎం నాగప్రసన్న ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై సెంట్రల్ క్రైం బ్రాంచ్ విచారణ చేపట్టాలని రాజా హుస్సేన్ తరఫు లాయర్ న్యాయమూర్తిని కోరారు.
ఈ సమయంలో తన క్లయింట్‌పై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, ఆమెకు కేవలం నలుగురితోనే వివాహం జరిగిందని చెప్పారు.మొదటి వివాహమైన తర్వాత అతడు చనిపోవడంతో మరొకర్ని పెళ్లాడారని, ముస్లిం మత చట్టం ప్రకారం విడాకులు తీసుకుని మిగతావారిని పెళ్లి చేసుకున్నట్టు పేర్కొన్నారు. వాదనలు విన్న జస్టిస్ నాగప్రసన్న.. ఇరు పక్షాల వారికి నోటీసులు ఇచ్చారు. తదుపరి విచారణను సెప్టెంబరు 27కు వాయిదా వేశారు. అప్పటిలోగా ఆరోపణలకు సంబంధించిన ఆధారాలను, సాక్ష్యాలను సమర్పించాలన్నారు.