కోల్‌కతా ట్రామ్ సర్వీస్ 151 సంవత్సరాల ప్రయాణం ఇక ఆగిపోయింది. మారుతున్న కాలం, ఆధునిక రవాణా మార్గాల ఆగమనంతో సహా అనేక కారణాల వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. కోల్‌కతాలో ట్రామ్ సర్వీసును నిలిపివేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో నగరంలోని వారసత్వ ప్రేమికుల్లో నిరాశ ఏర్పడింది. ఈ ట్రామ్ నెట్‌వర్క్, 1873 సంవత్సరంలో ప్రారంభించినట్లు చరిత్ర చెబుతుంది.
ఇది ఆసియాలోనే అత్యంత పురాతనమైనది. అలాగే కోల్‌కతా నగరానికి ఓ ప్రత్యేకమైన గుర్తింపుగా ఉంది. అయితే, ఒక మార్గం పనిచేస్తుందని ప్రభుత్వం పేర్కొంది. చెక్క బెంచీలపై ప్రయాణిస్తూ, నెమ్మదిగా కదులుతున్న కాలాన్ని ఆ రైలు ప్రయాణంలో అనుభవించడానికి ప్రపంచం నలుమూలల నుండి ఇక్కడికి ప్రజలు వస్తుంటారు. ఈ ట్రామ్‌లు బెంగాల్ ప్రజలతో పాటు దేశప్రజల హృదయాల్లో ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్నాయి. ఇది కోల్‌కతా నగరానికి ఓ ప్రత్యేక గుర్తింపును తీసుకుని వచ్చింది.
కోల్‌కతాలో ట్రామ్ వ్యవస్థ 24 ఫిబ్రవరి 1873లో ప్రారంభం అయ్యింది. ఇది మొట్ట మొదట సీల్దా – అర్మేనియన్ ఘాట్ స్ట్రీట్ మధ్య 3.9 కి.మీ దూరం వరకు తిరిగింది. భారతదేశంలో ట్రామ్ వ్యవస్థ పనిచేసే ఏకైక నగరం కోల్‌కతా. ట్రామ్‌ను నగరం లైఫ్‌లైన్‌గా చెబుతుంటారు. కోల్‌కతాలోని ట్రామ్ వ్యవస్థ ఆసియాలోనే అత్యంత పురాతన ఎలక్ట్రిక్ ట్రామ్‌వే ఇది. దేశంలో ఇప్పటికీ పనిచేస్తున్న ఏకైక ట్రామ్ నెట్‌వర్క్ ఇది. 1880లో కలకత్తా ట్రామ్‌వే కంపెనీ ఏర్పడి లండన్‌లో నమోదు చేయబడింది. సీల్దా నుండి అర్మేనియన్ ఘాట్ వరకు గుర్రపు ట్రామ్ ట్రాక్‌లను కూడా వేయడం జరిగింది. కానీ రెండు సంవత్సరాల తరువాత, 1882 లో, ట్రామ్ కార్లను లాగడానికి ఆవిరి ఇంజిన్లను ఉపయోగించడం ప్రారంభించారు. ట్రామ్‌వే విద్యుద్దీకరణ 1900 సంవత్సరంలో ప్రారంభించబడింది.
ఇది ఆవిరి నుండి విద్యుత్తుగా మార్చింది. 27 మార్చి 1902న, ఆసియాలో మొట్టమొదటి ఎలక్ట్రిక్ ట్రామ్‌కార్ ఎస్ప్లానేడ్ నుండి కిడర్‌పోర్ వరకు నడిచింది. 1903-1904లో, ఇది కాళీఘాట్, బాగ్‌బజార్‌లకు అనుసంధానంతో పాటు ఈ ట్రామ్ ని కొత్త మార్గాల్లో నడపడం ప్రారంభించారు. ఆ తరువాత కోల్‌కతా ప్రజల జీవనాధారంగా మారింది.
హౌరా వంతెన నిర్మాణం 1943లో పూర్తయింది. ట్రామ్ నెట్‌వర్క్ లోని కలకత్తా, హౌరా విభాగాలను కలుపుతూ.. మొత్తం ట్రాక్ పొడవు సుమారు 67.59 కి.మీ. భారతదేశం స్వాతంత్రం పొందిన తరువాత, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ట్రామ్‌వే నిర్వహణలో మరింత చురుకుగా వ్యవహరించింది. 1951లో ప్రభుత్వ పర్యవేక్షణ కోసం కలకత్తా ట్రామ్‌వేస్ కంపెనీతో ఒప్పందం కుదిరింది. ఇది 1976లో జాతీయం చేయబడింది. అయితే, మెట్రో శకం ప్రారంభంతో ట్రామ్‌వే విస్తరణ ఆగింది.