/rtv/media/media_files/2026/02/16/pm-modi-to-visit-israel-on-february-25-26-2026-02-16-20-46-30.jpg)
PM Modi to visit Israel on February 25-26
మధ్యప్రాచ్యంలో తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతుండగా భారత ప్రధాని నరేంద్ర మోదీ 2 రోజుల అధికారిక పర్యటన కోసం నేడు ఇజ్రాయెల్‌కు బయలుదేరారు. ఈ పర్యటన కేవలం ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికే కాకుండా, మారుతున్న ప్రపంచ రాజకీయ సమీకరణాల్లో భారత్ పోషించబోయే కీలక పాత్రకు నిదర్శనంగా నిలవనుంది.
అరుదైన గౌరవం.. పార్లమెంట్‌లో ప్రసంగం
ఈ పర్యటనలో ప్రధాని మోదీకి ఇజ్రాయెల్ ప్రభుత్వం అరుదైన గౌరవాన్ని కల్పించింది. ఇజ్రాయెల్ పార్లమెంట్ (నెస్సెట్)ను ఉద్దేశించి మోదీ ప్రసంగించనున్నారు. గతంలో 2015లో అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి ఈ అవకాశం దక్కగా, మళ్లీ పదేళ్ల తర్వాత ఒక భారతీయ అగ్రనేత అక్కడ ప్రసంగించడం విశేషం. అలాగే ఇజ్రాయెల్ అధ్యక్షుడు ఐజాక్ హెర్జోగ్‌తో కూడా మోదీ భేటీ కానున్నారు.
కొత్త కూటమి ‘షడ్భుజ’ ఆవిర్భావం?
ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఈ పర్యటనను పురస్కరించుకుని సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్‌ను ప్రపంచ శక్తిగా అభివర్ణించిన ఆయన, 'రాడికల్' విరోధులను ఎదుర్కోవడానికి 'షడ్భుజ' పేరుతో కొత్త కూటమిని ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించారు. ఈ కూటమిలో భారత్, ఇజ్రాయెల్, గ్రీస్, సైప్రస్‌లు ప్రధాన సభ్యులుగా ఉండనున్నాయి. భవిష్యత్తులో అరబ్, ఆఫ్రికన్, ఇతర ఆసియా దేశాలు కూడా ఇందులో చేరే అవకాశం ఉందని ఇజ్రాయెల్ విదేశాంగ శాఖ తెలిపింది. పాకిస్థాన్, సౌదీ అరేబియా, టర్కీలు 'నాటో' తరహా కూటమి కోసం ప్రయత్నిస్తున్న తరుణంలో, నెతన్యాహు ప్రతిపాదిస్తున్న ఈ కొత్త కూటమి అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది.
కీలక ఒప్పందాలు.. ఏఐపై దృష్టి
ఇప్పటికే విదేశాంగ మంత్రి జైశంకర్, వాణిజ్య మంత్రి పియూస్ గోయల్ ఇజ్రాయెల్‌లో పర్యటించి పునాది వేయగా, మోదీ పర్యటనలో రక్షణ, సాంకేతికత మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రంగాల్లో కీలక ఒప్పందాలు జరిగే అవకాశం ఉంది. ఇటీవల ఢిల్లీలో జరిగిన 'ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్'లో ఇజ్రాయెల్ ప్రతినిధులు పాల్గొనడం ఈ బంధానికి మరింత బలాన్ని చేకూర్చింది.
ప్రధాని మోదీ ఆకాంక్ష
"ఇజ్రాయెల్‌తో విశ్వాసం, ఆవిష్కరణ మరియు శాంతి పట్ల ఉమ్మడి నిబద్ధతపై నిర్మించబడిన శాశ్వత స్నేహాన్ని భారతదేశం ఎంతో విలువైనదిగా భావిస్తుంది" అని ప్రధాని మోదీ ఎక్స్ (X) వేదికగా పేర్కొన్నారు. ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న తరుణంలో మోదీ పర్యటన శాంతి స్థాపనకు లేదా కొత్త వ్యూహాత్మక అడుగులకు దారితీస్తుందో చూడాలి.
Follow Us