/rtv/media/media_files/2026/01/11/jaish-chief-masood-2026-01-11-19-27-53.jpg)
అంతర్జాతీయ ఉగ్రవాది, జైష్-ఎ-మొహమ్మద్ సంస్థ అధినేత మౌలానా మసూద్ అజార్ మరోసారి భారత్‌పై విషం చిమ్మాడు. ఇటీవల వెలుగులోకి వచ్చిన ఓ ఆడియో రికార్డింగ్‌లో అతను భారత్‌కు వార్నింగ్ ఇస్తూ వ్యాఖ్యలు చేశాడు. తన వద్ద ఒక్కరు, ఇద్దరు కాదు.. ఏకంగా వెయ్యి మందికి పైగా ఆత్మాహుతి బాంబర్లు సిద్ధంగా ఉన్నారని, వారు ఏ క్షణంలోనైనా భారత్‌పై విరుచుకుపడటానికి సిద్ధంగా ఉన్నారని ప్రకటించాడు. ఆపరేషన్ సింధూర్‌కు బదులుగా మసూద్ భారత్‌పై ప్రతీకారం తీర్చుకుంటానని హెచ్చరిస్తున్నాడు.
ఆపరేషన్ సింధూర్‌కు ప్రతీకారం
పహల్గామ్ అటాక్‌కు ధీటుగా ఇండియాన్ ఆర్మీ నిర్వహించిన 'ఆపరేషన్ సిందూర్' దాడిలో పాకిస్తాన్‌లోని బహవల్‌పూర్‌లో ఉన్న జైషే ప్రధాన కార్యాలయం 'మర్కజ్ సుబానల్లా' ధ్వంసమైంది. ఈ దాడిలో మసూద్ అజార్ సోదరి, మేనల్లుడు సహా అతని కుటుంబానికి చెందిన 10 మంది సభ్యులు హతమయ్యారు. అప్పటి నుండి ప్రతీకారంతో రగిలిపోతున్న అజార్, ఇప్పుడు ఆత్మాహుతి దళాలను రంగంలోకి దింపుతున్నట్లు పేర్కొన్నాడు. "నా యోధుల సంఖ్యను బహిరంగంగా ప్రకటిస్తే ప్రపంచం షాక్ అవుతుంది. వీరంతా భారతదేశంలోకి చొరబడేందుకు నాపై ఒత్తిడి తెస్తున్నారు" అతను ఆ ఆడియోలో అన్నాడు.
మహిళా బ్రిగేడ్ ఏర్పాటు
భారత భద్రతా బలగాల కళ్లుగప్పేందుకు మసూద్ అజార్ సరికొత్త ప్లాన్‌తో వస్తున్నట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. ఈ క్రమంలోనే 'జమాత్-ఉల్-మొమినాత్' పేరుతో మహిళా ఉగ్రవాద విభాగాన్ని అతను ఏర్పాటు చేశాడు. మహిళలను ఆత్మాహుతి బాంబర్లుగా మార్చి, తనిఖీలు తక్కువగా ఉండే ప్రాంతాల్లో దాడులు చేయాలనేది అతని కుట్రగా తెలుస్తోంది.
హై అలర్ట్‌లో భారత్
2001 పార్లమెంట్ దాడి, 2008 ముంబై దాడులు మరియు 2019 పుల్వామా దాడి వెనుక కీలక సూత్రధారి అయిన అజార్ ప్రకటనను భారత ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోంది. దేశవ్యాప్తంగా, ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్, సరిహద్దు ప్రాంతాల్లో 'హై అలర్ట్' ప్రకటించారు. నిఘా సంస్థలు సోషల్ మీడియా ఇతర సమాచార వ్యవస్థలపై నిశిత దృష్టి సారించాయి. పాకిస్తాన్ ఆశ్రయంలో ఉన్న మసూద్ అజార్‌ను అప్పగించాలని భారత్ ఎప్పటినుంచో డిమాండ్ చేస్తోంది. అయితే, అతను ఇలాంటి రెచ్చగొట్టే ఆడియోల ద్వారా తన ఉనికిని చాటుకుంటూ భారత్‌లో అస్థిరత సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నాడు. భారత సైన్యం కూడా ఏలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉంది.
Follow Us