డిఫెన్స్ రంగంలో ఇండియా మరో విజయం.. ఇక సముద్రంలోంచి అణు దాడులే!

భారత్ రక్షణ రంగం మరో చారిత్రాత్మక మైలురాయిని అధిగమించింది. సముద్ర గర్భం నుంచి అణు దాడులు చేయగల 'కే-4' బాలిస్టిక్ క్షిపణిని భారత్ విజయవంతంగా పరీక్షించింది. డిసెంబర్ 23న బంగాళాఖాతంలో INS అరిఘాత్ నుండి ఈ ప్రయోగాన్ని నిర్వహించారు.

New Update
K - 2

భారత్ రక్షణ రంగం మరో చారిత్రాత్మక మైలురాయిని అధిగమించింది. శత్రువుల వెన్నులో వణుకు పుట్టించేలా, సముద్ర గర్భం నుంచి అణు దాడులు చేయగల 'కే-4' (K-4) బాలిస్టిక్ క్షిపణిని భారత్ విజయవంతంగా పరీక్షించింది. 2025 డిసెంబర్ 23న బంగాళాఖాతంలో స్వదేశీ అణు జలాంతర్గామి ఐఎన్ఎస్ అరిఘాత్ నుండి ఈ ప్రయోగాన్ని నిర్వహించారు.

శత్రువుల కన్నుగప్పి..

DRDO, ఇండియన్ నేవీ ఈ క్షిపణి పరీక్ష సీక్రెట్‌గా నిర్వహించింది. శత్రు దేశాలకు ఈ విషయం తెలియకుండా అత్యంత గోప్యతను పాటించాయి. వాస్తవానికి ఈ పరీక్ష డిసెంబర్ మొదటి వారంలోనే జరగాల్సి ఉంది. అయితే, ఆ సమయంలో బంగాళాఖాతంలో చైనాకు చెందిన నిఘా నౌకలు సంచరిస్తుండటంతో, మన క్షిపణి సమాచారం శత్రువులకు చిక్కకుండా ఉండేందుకు ప్రయోగాన్ని వాయిదా వేశారు. ఈ పరీక్షలో క్షిపణి తన గరిష్ట పరిధిని చేరుకుని, నిర్దేశిత లక్ష్యాన్ని అత్యంత ఖచ్చితత్వంతో ఛేదించిందని అధికారిక వర్గాలు తెలిపాయి.

కే-4 క్షిపణి ప్రత్యేకతలు

కే-4 క్షిపణి భారత్ వద్ద ఉన్న అత్యంత శక్తివంతమైన సబ్‌మెరైన్ లాంచ్డ్ బాలిస్టిక్ క్షిపణులలో ఒకటి. ఈ క్షిపణి సుమారు 3,500 కిలోమీటర్ల దూరంలోని టార్గెట్‌లను అటాక్ చేయగలదు. దీనివల్ల హిందూ మహాసముద్రం నుంచి ఆసియాలోని ప్రధాన ప్రాంతాలను భారత్ గురిపెట్టగలదు. ఇది సుమారు 2 టన్నుల బరువున్న అణ్వాయుధాలను మోసుకెళ్లగలదు. ఇది 'కోల్డ్ లాంచ్' పద్ధతిలో పనిచేస్తుంది. అంటే క్షిపణి మొదట నీటి ఉపరితలం పైకి వచ్చి, ఆ తర్వాతే దాని మోటార్లు మండి లక్ష్యం వైపు దూసుకెళ్తుంది. 12 మీటర్ల పొడవు, 17 టన్నుల బరువు కలిగిన ఈ క్షిపణిని అరిహంత్ తరగతి జలాంతర్గాముల కోసం ప్రత్యేకంగా రూపొందించారు.

‘అణు త్రయం’ బలోపేతం 

ఈ ప్రయోగం విజయవంతం కావడంతో భారత్ యొక్క 'అణు త్రయం' సామర్థ్యం మరింత బలోపేతమైంది. భూమి (అగ్ని క్షిపణులు), ఆకాశం (యుద్ధ విమానాలు) తర్వాత ఇప్పుడు సముద్రం (INS అరిఘాత్ + K-4) నుండి కూడా భారత్ అణు దాడులను సమర్థవంతంగా నిర్వహించగలదు. శత్రువు మనపై మొదటి దాడి చేసినప్పటికీ, సముద్రం లోపల దాగి ఉన్న అణు జలాంతర్గాముల ద్వారా తిరిగి తీవ్రమైన ప్రతిదాడి చేసే 'సెకండ్ స్ట్రైక్' సామర్థ్యం భారత్‌కు చేకూరింది.

Advertisment
తాజా కథనాలు