/rtv/media/media_files/2025/11/26/fotojet-2025-11-26t093212056-2025-11-26-09-34-55.jpg)
Huge H-1B Visa scam in Chennai?
H-1B Visa: హెచ్-1బీ (H-1B Visa) వీసాలు దుర్వినియోగం అవుతున్నాయన్న ఆరోపణలకు బలం చేకూరేలా భారతీయ- అమెరికన్ దౌత్యవేత్త మహవష్ సిద్ధిఖీ చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి. మంచి నైపుణ్యం కలిగిన విదేశీ నిపుణుల కోసం అమెరికా కంపెనీలు హెచ్-1బీ (H-1B Visa) వీసా అందిస్తుంటాయి. అయితే వీటిపై గత కొన్ని రోజులుగా తీవ్ర చర్చ జరుగుతుంది. ఈ వీసాలు దుర్వినయోగం అవుతున్నాయన్న ఆరోపణలున్నాయి. దీంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పలు కఠిన నిర్ణయాలు తీసుకున్నారు. కాగా తాజాగా నకిలీ డిగ్రీలు, రాజకీయ ఒత్తిళ్లతో భారతీయులు ఈ హెచ్-1బీ వీసాలు పొందుతున్నారంటూ మహవష్ సిద్ధిఖీ ఆరోపించడం చర్చనీయంశమైంది.
మహవష్ సిద్ధిఖీ 2005-07 మధ్య చెన్నై కాన్సులేట్‌లో అమెరికా దౌత్యవేత్తగా పనిచేశారు. ఆమె ఓ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ చేసిన పలు కీలక వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. అమెరికాలో సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్ విభాగాల్లో నేటికీ ప్రతిభావంతుల కొరత ఉందని ఆమె అంగీకరించారు. దాన్ని భర్తీ చేయాల్సింది భారత్ నుంచి వచ్చేవారే. అయితే ఇందుకోసం భారతీయులకు జారీ చేసిన 80-90% హెచ్-1బీ వీసాలు నకిలీవని ఆమె ఆరోపించారు. అవన్నీ వారు నకిలీ డిగ్రీలు, పత్రాలతో పొందినవేనన్నారు. హెచ్-1బీ వీసాకు కావాల్సిన నైపుణ్యం వారికి అసలే లేదని ఆమె వ్యాఖ్యానించారు. చెన్నైలో కాన్సులర్‌గా ఉన్నప్పుడు తాము ఈ మోసాన్ని గుర్తించి, విదేశాంగ కార్యదర్శికి సమాచారం ఇచ్చినట్లు తెలిపారు. కానీ, రాజకీయ ఒత్తిళ్ల కారణంగా వారు ఎలాంటి చర్యలు తీసుకోలేదని వెల్లడించారు. ఇందులో అనేకమంది రాజకీయ నాయకుల హస్తం ఉందని ఆమె ఆరోపించారు. దీనిపై ఎలాంటి దర్యాప్తు జరపకూడదని తమపై పలువురు ఒత్తిడి తెచ్చారన్నారు. భారతీయ నాయకులను సంతృప్తి పరిచేందుకు ఈ మోసాలు జరిగాయని తెలిపారు.
చెన్నై కాన్సులేట్‌లో తాను పని చేస్తున్నప్పుడు 51వేలకు పైగా వలసేతర వీసాలు జారీ చేశామని తెలిపారు. వాటిల్లో ఎక్కువగా హెచ్-1బీ వీసాలే ఉన్నాయి. ఈ కాన్సులేట్‌లో హైదరాబాద్, కర్ణాటక, కేరళ, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన వీసా దరఖాస్తులను పరిశీలించినట్లు ఆమె తెలిపారు. ఇందులో ముఖ్యంగా హైదరాబాద్ నుంచి వచ్చిన దరఖాస్తుల పైనా ఆందోళన వ్యక్తంచేశారు. ఒక భారతీయ- అమెరికన్‌గా ఇలా చెప్పేందుకు తనకు ఇబ్బందిగా ఉందని అంటూనే భారత్‌లో మోసం, లంచం సాధారణమైనవని ఆమె వ్యాఖ్యానించారు. ఉద్యోగ ఇంటర్వ్యూలు చేసే వ్యక్తి అమెరికన్ అయితే.. అభ్యర్థులు ఇంటర్వ్యూలకు కూడా హాజరయ్యేవారు కాదని బాంబ్ పేల్చారు.అదే సమయంలో భారతీయ అధికారులు ఇంటర్వ్యూలు చేస్తే.. అభ్యర్థుల నుంచి లంచం తీసుకొని ఉద్యోగాలు ఇస్తారని సంచలన వ్యాఖ్యలు చేశారు.
2 లక్షలకు పైగా హెచ్-1బీ వీసాలు..!
కాగా, హెచ్-1బీ వీసాలలో జరుగుతున్న మోసాలపై అమెరికా మాజీ ప్రతినిధి, ఆర్థికవేత్త డాక్టర్ డేవ్ బ్రాట్ కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేయడం కలకలం రేపింది. భారత్‌లోని చెన్నై నగరం నుంచే 2 లక్షలకు పైగా హెచ్-1బీ వీసాలు పొందడంపై ఆయన అనుమానాలు వ్యక్తం చేశారు. ఆయన కూడా ఓ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. వీసా కేటాయింపుల విషయంలో భారత్ చట్టబద్ధమైన పరిమితులు ఎప్పుడో దాటిపోయిందన్నారు. ‘భారత్ నుంచి హెచ్-1బీ వీసాలపై అమెరికాకు వచ్చేవారు 71శాతం మంది ఉండగా, చైనా నుంచి 12 శాతం మంది మాత్రమే ఉన్నారు. అయితే భారత్‌కు కేవలం 85వేలు మాత్రమే హెచ్-1బీ వీసాలు జారీ చేయాలన్న పరిమితి ఉంది. అలాంటప్పుడు ఒక్క చెన్నై నగరం నుంచే 2,20,000 హెచ్-1బీ వీసాలు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. అది అమెరికన్ కాంగ్రెస్ నిర్ణయించిన పరిమితికి 2.5 రెట్లు ఎక్కువ. దీంతో అక్కడ ఏదో మోసం జరుగుతుందనేది స్పష్టమవుతోంది’ అని ఆయన అనుమానం వ్యక్తం చేశారు.
Follow Us